శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీరీదరిని...నేనాదరిని...ఫేస్ బుక్ కలిపింది...అందరినీ:12 ఏళ్లకు తిరిగొచ్చిన అన్నయ్య

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

"ఫేస్ బుక్" గురించి ప్రస్తుత రోజుల్లో ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరమేలేనంత పాపులర్ సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్. ఫేస్‌బుక్‌ వల్ల ఎవరు ఎలా ఎంత ఆనందం పొందుతున్నారో విడమర్చి చెప్పడం కష్టం కానీ... తాము మాత్రం ఈ ముఖపుస్తకానికి ఎంతో రుణపడివున్నామంటోంది ఓ కుటుంబం. కారణం...ఏనాడో విడిపోయిన తమ కుటుంబాన్ని ఈ ఫేస్ బుక్కే కలిపిందని ఎంతో ఆనందపడిపోతుంది ఆ కుటుంబం...అచ్చం సినిమాటిక్ గా జరిగిన ఈ ఘటన మీరీదరిని...నేనాదరిని...ఫేస్ బుక్ కలిపింది...అందరినీ అని ఒక సినీ గీతం స్టయిల్లో పాడుకునేలా చేసింది ఫేస్ బుక్.

వ్యసనపరుడైన తండ్రి దెబ్బలకు భయపడి అన్న పారిపోవడం...తల్లి చనిపోయి... తండ్రి వదిలేసి వెళ్లిపోవడంతో అనాథలుగా మిగిలిన ముగ్గరు చిన్నారులను ఓ అనాథాశ్రమం అక్కున చేర్చుకుంది. విద్యాబుద్దులు నేర్పించి ప్రయోజకుల్ని చేస్తోంది...అయితే ఊహించని విధంగా ఫేస్ బుక్ ద్వారా తనవాళ్ల సమాచారం తెలుసుకున్న అన్న 12 ఏళ్ల తరువాత తన తోబుట్టువులను కలిసేందుకు ఆ వెదుక్కుంటూ ఆ అనాథాశ్రమానికి వచ్చాడు...అంతే ఇంక అక్కడ మనుషులకు మాత్రమే ప్రత్యేకమైన అన్ని భావోద్వేగాలు వెల్లివిరిసాయి. అలా తిరిగివచ్చిన ఆ అన్న కథనం ప్రకారం...

ఫ్లాష్ బ్యాక్...పారిపోయిన పెద్దకొడుకు

ఫ్లాష్ బ్యాక్...పారిపోయిన పెద్దకొడుకు

శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలానికి చెందిన తర్ని శంకరరావు, కాంతమ్మలకు నలుగురు సంతానం. ముగ్గురు కొడుకులు ఒక కుమార్తె. వీరిలో పెద్ద కుమారుడు సంతోష్‌, రెండో కుమారుడు కృష్ణ, మూడో కుమార్తె నీలవేణి...చివరి సంతానం రాజ్ కుమార్. మద్యానికి బానిస అయిన శంకరరావు నిత్యం భార్యను, పిల్లలను బాగా కొట్టేవాడు. భర్త తనతో పాటు పిల్లలను సైతం చీటికిమాటికి చితకబాదుతుండటంతో అతడు పెట్టే బాధల నుంచి రక్షించుకోవడానికి తల్లి తన పిల్లలను పుట్టినిల్లైన పాతపట్నం నియోజకవర్గంలోని రొంపివలసకు తీసుకువెళ్లి తన కుటుంబసభ్యుల వద్ద ఉంచింది. అయితే ఈ విషయం తెలుసుకున్న శంకరరావు రొంపివలస వెళ్లి మళ్లీ పిల్లలను తీసుకొచ్చేశాడు. అయితే మళ్లీ తాగడం...భార్యాపిల్లలను చితకబాదే విషయంలో ఏ మార్పు లేదు. దీంతో తండ్రి హింస తట్టుకోలేక పెద్దకుమారుడు సంతోష్‌కుమార్‌ భయంతో ఇంటి నుంచి పారిపోయారు. ఈ ఘటన 2006లో జరిగింది.

ఆ తర్వాత...చెల్లాచెదురైన కుటుంబం

ఆ తర్వాత...చెల్లాచెదురైన కుటుంబం

సంతోష్ పారిపోయాక ఆ కుటుంబం పరిస్థితి మరింత దిగజారింది. వ్యసనానికి బానిసైన తండ్రి ఈ కుటుండాన్ని నేను పోషించలేనంటూ ఇల్లు వదిలి ఎటో వెళ్లిపోయాడు.పెద్దకుమారుడు ఇంట్లో నుంచి పారిపోవడం, భర్త శంకరరావు తనను పిల్లలను విడిచి తనమానాన తాను వెళ్లిపోవడంతో తీవ్ర మానసికవ్యధకు లోనైన తల్లి కాంతమ్మ ఆరోగ్యం క్షీణించింది. అసలే ఏ ఆసరా లేని నిరుపేద కుటుంబం కావడం,పిల్లలు చిన్నవారు కావడంతో ఆమెకు వైద్యం చేయించేవారు లేక 2008లోనే ఆమె చనిపోయింది. తల్లి, తండ్రి లేని పిల్లలను గ్రామస్థులే జిల్లా ముఖ్యపట్టణం శ్రీకాకుళంలో అమ్మా ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న ఉత్తమ్‌ అనే వ్యక్తికి వీరికి ఆశ్రయం కల్పించాలని కోరి అప్పగించారు.

 మరోవైపు...సంతోష్ ప్రస్థానం

మరోవైపు...సంతోష్ ప్రస్థానం

ఇంట్లో నుంచి వచ్చేసిన సంతోష్ ఆ తర్వాత ఎక్కడెక్కడో చిన్నాచితక పనులుచేసుకుని కడుపు నింపుకునేవాడు. అలా రెండేళ్లపాటు కంచిలి మండలంలో ఓ వ్యాపారి ఇంట్లో పనికి కుదిరాడు. ఇంటికి వెళ్లాలని మనసు లాగుతున్నా తండ్రికి భయపడి వెళ్ళేవాడుకాదు. ఆ తరువాత అక్కడినుంచి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. అక్కడా ఉపాధి కోసం అనేక పలు పనులు చేశాడు. ఆ తర్వాత రెడ్డీస్‌ ల్యాబ్‌లో ఒక కాంట్రాక్టర్‌ వద్ద ఉద్యోగిగా స్థిరపడి పెళ్లి కూడా చేసుకున్నాడు. అమ్మా తోబుట్టుల మీద మమకారంతో 2011లో తాము చిన్నప్పుడు నివసించిన గ్రామం సీతంపేట వెళ్లగా తండ్రి ఎటో వెళ్లిపోయాడని, తల్లి మృతి చెందిందని, మిగతావారు ఎక్కడికి వెళ్లారో తెలియదని గ్రామస్థులు చెప్పడంతో ఆవేదన చెంది తిరిగి హైదరాబాదు వచ్చేశాడు. అయితే తనవారి కోసం అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు.

ముగ్గురు తోబుట్టువులు...విద్యాగంధం

ముగ్గురు తోబుట్టువులు...విద్యాగంధం

అన్న పారిపోవడం...తండ్రి వదిలేసివెళ్లడం...అమ్మ చనిపోవడంతో అనాథలుగా మారిన ఈ చిన్నారులకు శ్రీకాకుళం "అమ్మా ఫౌండేషన్‌" తానే అమ్మయింది. వారికి విద్యాబుద్దులు నేర్పించింది. జీవితగమనంలో ఎదిగేందుకు అండగా నిలిచింది. అలా అమ్మా ఫౌండేషన్‌ వారు ఇచ్చిన మానసిక ధైర్యం, ప్రోత్సాహంతో 2008 నుంచీ ఈ ముగ్గురు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అలా ఆయుర్వేదంలో ఫిజియోథెరపి చదివిన సంతానంలో రెండో వాడైన కృష్ణ విశాఖపట్నంలో ఫిజియోథెరపిస్ట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. మూడో సంతానం నీలవేణి రిమ్స్‌లోని నర్సింగ్‌ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్‌ థర్డ్ ఇయర్ చదువుతోంది. చివరివాడు రాజ్‌కుమార్‌ ఇంటర్మీడియేట్‌ చదువుతున్నాడు. వీరు కూడా తమ కుటుంబం గురించి ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు.

ఫేస్ బుక్...కలిపింది

ఫేస్ బుక్...కలిపింది

హైదరాబాద్‌లోని మిత్రులతో తన కుటుంబ విషయాలు గురించి చెప్పి బాధపడే సంతోష్‌కుమార్‌కు నాలుగురోజుల క్రితం ఓ మిత్రుడు ఫేస్ బుక్ లో తాను చూసిన ఒక సమాచారాన్ని ఫార్వార్డ్ చేశాడు. దాన్ని చదివిన సంతోష్‌ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తన ఇద్దరు సోదరులు, సోదరి గురించిన చిన్ననాటి వివరాలు, అప్పటి వారి ఫొటోలు అందులో ఉన్నాయి. కంప్యూటర్‌ ద్వారా వారి ముగ్గురి పేర్లు పరిశీలించుకున్న సంతోష్ వారు తన తోబుట్టువులేనని ధ్రువీకరించుకున్నాడు. వెంటనే హైదరాబాద్‌ నుంచి బయలులేరి ఆదివారం ఉదయం శ్రీకాకుళంలోని అమ్మా ఫౌండేషన్‌కు చేరుకున్నాడు. అక్కడ తన వారిని కలుసుకుని మురిసిపోయాడు...ఎప్పుడో 12 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన తమ అన్నయ్య హఠాత్తుగా తమ కళ్ల ముందుకు వచ్చేసరికి సోదరుల ఎంతో సంతోషపడ్డారు...చెల్లి నీలవేణి ఆనందానికి అవధుల్లేవు. అందరూ అతడిని పట్టుకుని ఆనందభాష్పాలు రాల్చారు....ఆ తర్వాత తమ కుటుంబం గురించి తలచుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు.

"అమ్మ" అంతటా...భావోద్వేగాలే

తమ అన్నకు సోదరులు, సోదరి చిన్ననాటి సంగతులు...తల్లి చనిపోయిన సందర్భం, తదితర విషయాల గురించి చెబుతూ చెప్పలేని భావోద్వేగానికి గురయ్యారు. దశాబ్ద కాలం పైబడి ఇంటి నుంచి వెళ్లిపోయిన అన్నయ్య, నిర్థాక్షిణ్యంగా తమను వదిలివెళ్ళిపోయిన తండ్రి, తమ కళ్ల ముందే అనారోగ్యంతో చనిపోయిన తల్లి...ఇలా అన్నీ విషాదాలే చవిచూసిన ఆ సంతానం మొట్టమొదటిసారిగా తమ జీవితంలో కుటుంబానికి సంబంధించి ఒక సంతోషకరమైన ఘట్టాన్ని చవి చూసి ఆనందంతో మాటలు రాని పరిస్థితికి గురయ్యారు. మరోవైపు వీరికి ఆశ్రయం ఇచ్చిన అమ్మా ఫౌండేషన్ లో కూడా వీరి ఉదంతం ఆనందాశ్చర్యాలు నింపింది. ఇంతకాలం తమతో అనాథలుగా గడిపి చదువులో చక్కగా రాణించిన నీలవేణి, రాజ్‌కుమార్‌, కృష్ణల సొంత అన్నయ్య వచ్చారని తెలియగానే తోటి విద్యార్థులంతా ఆసక్తిగా తిలకించారు.
2008లో తమను ఆశ్రమంలో చేర్పించిన నాటి నుంచి నేటి వరకు ఉన్న ఫొటోలను ఫౌండేషన్‌కు చెందిన ల్యాప్‌టాప్‌లో అన్నయ్యకు చెల్లెలు చూపించారు.

తీసుకువెళతా...చైల్డ్ లైన్ దే నిర్ణయం

తీసుకువెళతా...చైల్డ్ లైన్ దే నిర్ణయం

అనాథలుగా మిగిలిపోయి తనవారిని అమ్మా ఫౌండేషన్‌ ఆశ్రయం కల్పించి ప్రయోజకులను చేయడం ఎంతో ఆనందంగా ఉందని సంతోష్‌కుమార్‌ అన్నారు. తన తోబుట్టువుల విషయాన్ని భార్యకు ఫోన్ లో తెలియజేశానని...అందర్నీ హైదరాబాదు తీసుకువచ్చేయాలని ఆమె కోరిందని సంతోష్ కుమార్ చెప్పారు. మరోవైపు
2008లో తమ అమ్మా ఫౌండేషన్‌లో చేరిన ఈ ముగ్గురు పిల్లల అన్నయ్య సంతోష్‌కుమార్‌ రావడం తమకు ఎంతో ఆనందం కలుగజేసిందని నిర్వాహకులు ఉత్తమ్‌కుమార్‌ తెలిపారు. తమ వద్ద ఆశ్రయం పొందుతున్న పిల్లలను బాగా చదివిస్తున్నామని... అలాగే ఫేస్‌బుక్‌లో వారి పాత చిత్రాలు, నేటి చిత్రాలు పెడుతున్నామని...ఇలా చేయడం వల్లే ఒక కుటుంబం కలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.

అయితే...ఇలా అయితే బావుంటుంది...

అయితే...ఇలా అయితే బావుంటుంది...

ఇక నిబంధనల ప్రకారం సంతోష్‌ కుమార్‌కు తన గుర్తింపు పత్రాలు తీసుకురావాలని సూచించామని...సోమవారం ఛైల్డ్‌లైన్‌ అధికారులకు ఈ విషయం తెలియజేసి మిగతా ఫార్మాలీటీస్‌ పూర్తి చేస్తామన్నారు. అయితే వీరందరూ మేజర్లే అయినందున ఛైల్డ్‌లైన్‌ అధికారులు నిర్ణయం అమలు చేయడం జరుగుతుందని అమ్మా ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. అయితే నీలవేణి బీఎస్సీ నర్సింగ్‌ మరో సంవత్సరంతో పూర్తి అవుతుందని, రాజ్‌కుమార్‌ డిగ్రీ చదవాలని, కృష్ణ ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో స్థిరపడుతున్నందున...వీరు స్థిరపడేంత వరకు తమ ఫౌండేషన్‌లో ఉంచితే బావుంటుందనేది తమ భావనని నిర్వాహకుడు ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఇదే విషయాన్ని సంతోష్‌కుమార్‌కు తెలిపామని చెప్పారు.

English summary
This is a surprising event that Face Book combines a family. As a result, the family was shaken with pleasure. The Srikakulam "Amma Foundation" was the venue for this rare event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X