జగన్, బాబు, కెసిఆర్: రెండు చోట్లా కుటుంబ రాజకీయం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా, రెండుచోట్లా కుటుంబ రాజకీయాలదే పైచేయిగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కుటుంబ ప్రాధాన్యత కలిగిన రాజకీయ పార్టీలే హోరాహోరీ తలపడనున్నాయి. రాష్ట్రంలో అన్ని పార్టీలు కుటుంబ ప్రాధాన్యం, కులబలాన్ని ఆసరా చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా టిడిపి, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో అది కనిపిస్తోందంటున్నారు. తెరాస తెలంగాణకే పరిమితమైనా, తెదేపా, జగన్ పార్టీ సీమాంధ్రలో ముందంజలో ఉండి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి.
తెలంగాణలో తమ బలాన్ని నిలుపుకునేందుకూ ఆరాటపడుతున్నాయి. టిడిపిలో చంద్రబాబు, కుమారుడు లోకేష్, బావమరిది బాలకృష్ణలదే హవా. నందమూరి, నారా కుటుంబాల ఆదేశాల మేరకు తెదేపా నడుస్తుందని చెబుతున్నారు. తెలంగాణలో ఆ కుటుంబం నుండి ఒకరు పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. జగన్ పార్టీ కూడా కుటుంబ పార్టీగానే చెబుతున్నారు. పార్టీ అంతా జగన్ చుట్టే తిరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. పార్టీలో షర్మిలకు ఇంత వరకు ఎలాంటి బాధ్యతలు లేవు.

అయితే, తెలంగాణ బాధ్యతలను ఆమెకు అప్పగించవచ్చుననే ప్రచారం సాగుతోంది. దీంతో సీమాంధ్రలో జగన్, తెలంగాణలో షర్మిలల హవా పార్టీలో కొనసాగే అవకాశముంది. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర వహించిన తెరాస కూడా కుటుంబ పార్టీగానే ముద్ర పడింది. కెసిఆర్ వాక్పటిమ, రాజకీయ చతురత, వ్యూహాలు తెరాసకు బలమైన ఆయుధాలు.
కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. ఆమె వచ్చే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. కెసిఆర్ తనయుడు కెటిఆర్, అల్లుడు హరీష్ రావు ఎమ్మెల్యేలు. తెలంగాణ సాధించిన ధీరుడిగా పేరు తెచ్చుకున్న కెసిఆర్, ఇటీవల ఏఐసిసి అధినేత్రి సోనియాగాంధీని కుటుంబ సమేతంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై టిటిడిపి విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ పార్టీలోను కుటుంబ రాజకీయాల హవా కనిపిస్తోంది. పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, ఆయన ఒక సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. బొత్స సతీమణి ఝాన్సీ ఎంపీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications