చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి ముద్దుకృష్ణమ ఇంట్లో కుటుంబ పోరు:ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరు కొడుకుల యత్నం

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

చిత్తూరు:దివంగత నేత, మాజీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబంలో కుటుంబ పోరు రచ్చకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకు సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయమై సందిగ్ధం ఏర్పడగా చిన్న కుమారుడు జగదీషే వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అంటూ ముద్దుకృష్ణమ సతీమణి, ఎమ్మెల్సీ సరస్వతమ్మ కార్యకర్తలకు స్పష్టత ఇస్తున్నారు. అయితే ఇది నచ్చని పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్‌ ఇందుకు విరుగుడుగా టికెట్ కోసం సొంత ప్రయత్నాలు ఆరంభించడం...ఆ క్రమంలో బలప్రదర్శనకు పూనుకోవడం ఇప్పుడు స్థానికంగానే కాదు టిడిపి లోనూ హాట్ టాపిక్ గా మారింది.

గాలి మరణం... అనంతర పరిణామాలు

గాలి మరణం... అనంతర పరిణామాలు

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు 2018 ఫిబ్రవరిలో అనారోగ్యంతో మృతి చెందడంతో నగరి టీడీపీకి నాయకత్వం వహించేవారే లేకుండా పోయారు. మరోవైపు ఆయన రాజకీయ వారసత్వం కోసం కుమారులిద్దరి నడుమ గట్టి పోటీ నెలకొంది. అయితే కుటుంబ సభ్యుల్లో ఎక్కువమంది మద్దతు చిన్న కొడుకు జగదీష్‌కు లభించినా దీనికి పెద్ద కుమారుడు అంగీకరించలేదని తెలిసింది. ఈ క్రమంలో గాలి ముద్దు కృష్ణమ మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని టిడిపి అధిష్ఠానం ఆయన సతీమణి సరస్వతమ్మకు కట్టబెట్టింది. ఇన్‌ఛార్జిగా ఇతరులను నియమిస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ పగ్గాలు తమ కుటుంబం పట్టు నుంచి చేజారనివ్వకూడదని గట్టిగా భావిస్తున్న గాలి ముద్దుకృష్ణమ కుటుంబం ఆ ప్రయత్నాలు పడనివ్వడం లేదు.

తల్లి మద్దతు...చిన్న కుమారుడికే

తల్లి మద్దతు...చిన్న కుమారుడికే

మరోవైపు ఇక్కడ పార్టీ పగ్గాల కోసం గాలి ఇద్దరు కుమారుల మధ్య కీచులాటలు అంతకంతకూ ఉధృతమవుతున్నట్లు తెలిసింది. ఈ నేపత్యంలో ఇటీవల ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ తన చిన్న కుమారుడు జగదీషే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, మద్దతివ్వాలని కార్యకర్తలకు బహిరంగంగా పిలుపునివ్వడం చర్చనీయాంశం అయింది. దీంతో ఈ వ్యవహారంపై టిడిపి అధిష్ఠానం సీరియస్‌ అయినప్పటికీ హెచ్చరిక చేయడం మినహా మరే చెయ్యలేక మిన్నకుంది. అయితే తల్లి ప్రకటనతో జరగబోయేది గుర్తించిన గాలి పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్‌ అప్రమప్తమైనట్లు తెలుస్తోంది.

అందుకే సొంతగా...యువగర్జన పేరుతో...

అందుకే సొంతగా...యువగర్జన పేరుతో...

తన పట్ల కుటుంబ సభ్యుల వ్యతిరేకత విషయం అటుంచి పార్టీ అధిష్టానాన్ని మెప్పించడం ద్వారా స్థానికంగా తానే నాయకుడిగా అవతరించేందుకు గాలి పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్‌ ప్రయత్నాలు ఆరంభించారు. ఈ క్రమంలోనే నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీపై ఆధిపత్యమే లక్ష్యంగా ఆదివారం యువగర్జన పేరిట ఆయన తొలి అడుగు వేశారు. తాను ఈ విధంగా తన ఉనికి చాటుకోకుంటే తనతో సహా కుటుంబం మద్దతు అంతా జగదీష్‌కే ఉందంటూ పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతుందని, అది తాను రాజకీయంగా ఎదగాలన్న అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదముందని భానుప్రకాష్‌ యోచించి ఈ బలప్రదర్శనకు పూనుకున్నట్లు తెలుస్తోంది.

జనం మద్దతు...అధిష్టానం మెప్పు

జనం మద్దతు...అధిష్టానం మెప్పు

ఇలా పార్టీ కార్యక్రమాలతో నేరుగా జనాల్లోకి వెళ్లడం ద్వారా ఇటు పార్టీ శ్రేణులకు, జనాలకు దగ్గరవడంతో పాటు ప్రజల మద్దతు తనకు ఉన్నట్లు తెలిస్తే అది అధిష్టానం తనవైపు మొగ్గుచూసేందుకు దోహదపడుతుందని భాను ప్రకాష్ యోచనగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే తొలి ప్రయత్నంగా యువగర్జన పేరిట ఆదివారం భానుప్రకాష్‌ పార్టీ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి యువతను సమీకరించి ర్యాలీ, సమావేశం జరిపారు. సమావేశంలో ఎక్కడా తన గురించి మాట్లాడకుండా, తనకు మద్దతివ్వాలని పిలుపునివ్వకుండా అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్‌ నాయకత్వం గురించే ప్రధానంగా ప్రస్తావించడం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

లోకేష్,చంద్రబాబు...మెప్పు కోసం

లోకేష్,చంద్రబాబు...మెప్పు కోసం

చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతోందని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరిస్తూ...వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరడం ద్వారా అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. కాగా, భానుప్రకాష్‌ తొలి కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి వందలాది మంది యువకులతో పాటు స్థానిక ద్వితీయ శ్రేణి నేతలు కూడా పెద్ద సంఖ్యలోనే పాల్గొన్నారు. పుత్తూరు, నగరి పట్టణాల టీడీపీ అధ్యక్షులు, పుత్తూరు మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ కరుణాకర్‌, వైస్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌ రాజు, తుడా డైరెక్టర్‌ వడమాలపేట ధనుంజయనాయుడు తదితరులు హాజరయ్యారు. నియోజకవర్గంలో నలుగురు ఎంపీపీలుంటే వారిలో పుత్తూరు, పుత్తూరు ఎంపీపీలు గంజి మాధవయ్య, వేణుగోపాలనాయుడు వచ్చారు. జడ్పీటీసీలు ఇద్దరూ ఈ కార్యక్రమంలో కనిపించారు. భానుప్రకాష్‌ చేపట్టిన కార్యక్రమంతో ముద్దుకృష్ణమ కుటుంబంలో వారసత్వపోరు ఉందని, ఇది ఎక్కడికి దారితీస్తుందోననే చర్చ ఇటు టీడీపీ శ్రేణుల్లోనూ, అటు సామాన్య జనంలోనూ ముమ్మరంగా సాగుతోంది.

English summary
Chittoor: There is a fight between former TDP MLC Gali Muddukrishnama Naidu's two sons for political legacy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X