నిన్న తల్లి.. ఈరోజు తండ్రి.. కన్నబిడ్డల్ని కడతేర్చి కాటికి !!
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆలమూరు మండలం మడికి శివారులోని చిలకపాడు గ్రామంలో సెలూన్ షాప్ నిర్వహిస్తున్న పావులూరి కామరాజు అలియాస్ చంటి (36) దారుణానికి ఒడిగట్టారు. తన ఇద్దరు చిన్నారులకు విషం తాగించి.. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన జరగగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అసలు ఏం జరిగిందంటే..?
కామరాజు భార్య నాగదేవి ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై నాటి నుంచి కోర్టులో కేసు నడుస్తూ వస్తోంది. అయితే ఇటీవలే రాజీ కుదిరిందని సమాచారం. కానీ అనూహ్యంగా ఏమైందో తెలియదు కానీ.. అయిదవ తరగతి చదువుతున్న కుమారుడు అభిరామ్ (11), ఒకటవ తరగతి చదువుతున్న త్రినాథ్ గౌతమ్ (8) లకు పురుగుమందు తాగించాడు. ఆ తర్వాత తాను ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

ఇక ఈ ఘటనకు సంబంధించి చంటి ఓ వీడియో రికార్డు చేసినట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు రావులపాలెం రూరల్ సీఐ సి.హెచ్. విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి. నరేష్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. కారణం ఏదైనా కానీ చిన్నారుల ప్రాణాలను తీసి తాను కూడా చనిపోవడం సర్వత్రా విషాదం నింపుతోంది.
మరోవైపు ఇటీవలే బాలానగర్ పోలీస్ స్టేషన్ లో కూడా దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలను చంపి తల్లి చల్లారి సాయిలక్ష్మీ (27) బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. బాలానగర్ పద్మారావు నగర్ ఫేజ్ 1 లో నివాసం ఉంటున్న సాయి లక్ష్మీ, అనిల్ కుమార్ దంపతులు. వారికి రెండు సంవత్సరాల కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లి ఉన్నారు.
అయితే కుటుంబ కలహాల కారణంగా పిల్లలను చంపి తల్లి సాయిలక్ష్మీ ఆత్మహత్య చేసుకున్నట్టు వాపోతున్నారు. ఈ వరుస దుర్ఘటనల నేపధ్యంలో పిల్లలను చంపి వారు కూడా మరణించడం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా ఘటనలకు పాల్పడవద్దని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications