ఒకే గుడిలో ముగ్గురు స్టార్ డైరెక్టర్ల ప్రత్యేక పూజలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అలరారుతున్న పిఠాపురంలో ఒకేరోజు ముగ్గురు స్టార్ దర్శకులు ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషంగా మారింది. తమ తర్వాత సినిమాలకు ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా హోమం చేశారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అలరారుతున్న పిఠాపురంలో ఒకేరోజు ముగ్గురు స్టార్ దర్శకులు ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషంగా మారింది. పిఠాపురంలో పురుహూతికా శక్తిపీఠం కొలువై ఉండటంతోపాటు పాదగయ పుణ్యక్షేత్రం ఉంది. దత్తాత్రేయులువారు మొదటిసారిగా కలియుగంలో పిఠాపురంలోనే జన్మించారు. ఇక్కడకు మనవారికన్నా ఉత్తరాది రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ దేవస్థానాన్ని ప్రముఖ దర్శకులు కొరటాల శివ, హరీష్ శంకర్, సానా బుచ్చిబాబు దర్శించుకున్నారు. బుచ్చిబాబు సొంత ఊరు పిఠాపురం కావడంతో ఆయన కోరిక మేరకు అక్కడి ఆలయాలను దర్శించుకున్నారు.

సుకుమార్ కూడా త్వరలోనే వస్తారు..
పాదగయ క్షేత్రంలో హోమ పూజలు నిర్వహించారు. అనంతరం ఉపాలయాలను సందర్శించారు. పురుహూతికా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేశారు. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని హరీష్ శంకర్ అన్నారు. తమ గురువైనటువంటి దర్శకుడు సుకుమార్ కూడా పిఠాపురం వస్తానన్నారని బుచ్చిబాబు తెలిపారు.

ఆచార్య ప్రభావం కొరటాలపై...
అయితే ఇంత అకస్మాత్తుగా ముగ్గురు స్టార్ దర్శకులు ఒకే క్షేత్రంలో పూజలు ఎందుకు చేశారన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. కొరటాల శివ కుటుంబ సమేతంగా హోమం చేశారు. ఆచార్య సినిమా పరాజయం పాలైన తర్వాత కొరటాల శివ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఏదైనా కార్యక్రమం జరిగిన ప్రతిసారి కథానాయకుడు చిరంజీవి పరోక్షంగా కొరటాల శివను టార్గెట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమా కూడా స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో సిద్ధమవడానికి ఆలస్యం జరుగుతోంది.

పవన్ కల్యాణ్ తో ఆలస్యమవుతున్న సినిమా
హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ తో ఇట్లు భవదీయుడు భగత్ సింగ్ సినిమా తీయాలని ఏడాదిన్నర నుంచి ఎదురుచూస్తున్నప్పటికీ కార్యరూపం దాల్చడంలేదు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి.అలాగే బుచ్చిబాబు పెద్ది పేరుతో జూనియర్ ఎన్టీఆర్ తో తీద్దామనుకున్న సినిమా వాయిదా పడుతూ చివరకు రామ్ చరణ్ చెంతకు చేరింది. ఉప్పెన విడుదలైన తర్వాత రెండో సినిమా చేయడానికి తీవ్ర ఆలస్యం జరుగుతోంది. వీటన్నింటికీ పరిష్కారంగా శ్రీపాద శ్రీవల్లభుడిని దర్శించుకోవడమే కాకుండా హోమం కూడా చేశారు.












Click it and Unblock the Notifications