మస్కిటో కాయిల్.... గుడిసెకు నిప్పంటుకొని ఇద్దరు చిన్నారులు సజీవ దహనం (ఫోటోలు)
హైదరాబాద్: దోమల నివారణ కోసం పెట్టిన మస్కిటో కాయిల్ ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసింది. మంగళవారం రాత్రి రాజేంద్రనగర్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎల్లయ్య, మంగమ్మ దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. రేణుక(6), వసంత (3). కూలీ పనులకోసం నగరానికి వచ్చి వీరు రాజేంద్రనగర్‌లోని మల్లికార్జున నగర్‌లో గుడిసెల్లో ఉంటున్నారు.
ఇది ఇలా ఉండగా, మంగళవారం రాత్రి పిల్లలిద్దరూ గుడిసెలో నిద్రపోయారు. కూలీ పనులకు వెళ్లి వచ్చిన ఎల్లయ్య మద్యం తాగేందుకు బయటకు వెళ్లాడు. పిల్లలతో కలిసి గుడిసెలో ఉన్న మంగమ్మ గుడిసెలో దోమలు ఉండటంతో మస్కిటో కాయిల్ వెలిగించింది. పిల్లలిద్దరూ నిద్రలోకి జారుకున్నారు.

ఎల్లయ్య రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా ఇంటికి రాకపోవడంతో మంగమ్మ బయటకు వచ్చింది. గుడిసెలో ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. మంగమ్మ గుడిసెలో నుంచి బయటకు వచ్చిన 10, 15 నిమిషాల్లోనే గుడిసెకు నిప్పంటుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిశాయి.

స్ధానికులు గమనించి అప్రమత్తమయ్యే లోపే మంటలు చుట్టూ వ్యాపించి, పిల్లలిద్దరూ సజీవదహనమయ్యారు. కొద్ది దూరంలోనే ఉన్న మంగమ్మ పరుగుతీసుకుంటూ వచ్చి, పిల్లలను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఇద్దరు పిల్లలు సజీవ దహనం కావడంతో తల్లిదండ్రులు బోరుమని విలపించారు. మస్కిటో కాయిల్ నిప్పు గుడిసెకు అంటుకోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని మంగమ్మ, పోలీసులు చెబుతున్నారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తామని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications