పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం: నలుగురు మృతి;ఒకరి పరిస్థితి విషమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు. పరవాడ ఫార్మా సిటీ లోని లారస్ యూనిట్ 3 లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
మంటలను ఆర్పి అగ్నిమాపక సిబ్బంది బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సతీష్ అనే కార్మికుడికి కిమ్స్ ఐకాన్ లో చికిత్స అందిస్తుండగా, మిగిలిన నలుగురిని కేజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖమ్మం జిల్లాకు చెందిన బి రాంబాబు, గుంటూరు జిల్లాకు చెందిన రాజేష్ బాబు, చోడవరం కి చెందిన మజ్జి వెంకట్రావు, కే కోటపాడు కు చెందిన ఆర్ రామకృష్ణ మృతి చెందారు. దీంతో కార్మికుల కుటుంబాల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మారుమోగిపోతుంది.

లారస్ 3 యూనిట్లో మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్ ఫ్లాష్ ఫైర్ డ్రయర్ రూమ్ లో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. రియాక్టర్ కింద నుంచి ఫైర్ అవ్వడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు కార్మికులు ఒకే చాంబర్లో ఉండటంతో వారంతా ఒక్కసారిగా మంటల్లో తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే వీరందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది.
ఈ ఘటనలో గాయపడిన నలుగురు మృతి చెందగా, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కంపెనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు కొందరు చెబుతుంటే, మరికొందరు రసాయనాలు లీక్ కావడం వల్ల ప్రమాదం జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. పరవాడ ఫార్మా సిటీలో చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications