
జగన్ సర్కార్ కు తొలిసారి రివర్స్ టెండరింగ్ షాక్-కాంట్రాక్టర్ల సిండికేట్-ఆ ధరకు కొంటే చుక్కలే
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఖజానాకు ఆదా చేసేందుకు తెరపైకి తెచ్చిన ప్రక్రియ రివర్స్ టెండరింగ్. అనుకున్నట్లుగానే గతంలో టీడీపీ సర్కార్ హయాంలో కట్టబెట్టిన వందలాది కాంట్రాక్టులను తిరగతోడి వాటిలో రివర్స్ టెండరింగ్ అమలు చేసి భారీగానే లబ్ది పొందింది ఏపీ ప్రభుత్వం. కానీ అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు ఆ రివర్స్ టెండరింగ్ మాటెత్తేందుకే ప్రభుత్వం భయపడే పరిస్ధితులు నెలకొంటున్నాయి. దీనికి కారణం కాంట్రాక్టర్లు సిండికేట్ గా మారిపోతుండటమే.

వైసీపీ రివర్స్ టెండరింగ్
వైసీపీ హయాంలో తొలిసారి తెరపైకి వచ్చిన రివర్స్ టెండరింగ్ కు తొలి నాళ్లలో మంచి స్పందనే లభించింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం నుంచి వైసీపీకి అధికారం చేతులు మారడం. అప్పటికే ఇచ్చిన కాంటాక్టుల ప్రకారం పనులు ఇంకా మొదలు కాకపోవడం లేదా, మొదలైన పనులు పూర్తికాకపోవడం వంటి కారణాలతో రివర్స్ టెండరింగ్ ను ప్రభుత్వం విజయవంతంగానే అమలు చేసింది.
కానీ రానురానూ రివర్స్ టెండరింగ్ కు కష్టాలు మొదలయ్యాయి. ఓవైపు ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని అన్ని శాఖలకూ, అధికారులకూ టార్గెట్లు పెడుతుంటే వారు కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు. దీంతో ఈ ప్రక్రియ గాడితప్పింది.

సిండికేట్ గా మారిన కాంట్రాక్టర్లు
ప్రభుత్వాలు ఇవాళ ఉంటాయి, రేపు మారతాయి. కానీ కాంట్రాక్టర్లు అన్నాక కలిసుండాలి కదా అన్న తత్వం వారికి బోధపడింది. దీంతో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టులు పొంది అవి పూర్తి చేయలేని వారు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టులు పొందుతున్న వారూ జతకలిశారు.
అంతే ఈ కాంట్రాక్టర్ల సిండికేట్ ఇప్పుడు అన్ని వ్యవహారాల్లోనూ తమదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో ప్రభుత్వం ఇరుకున పడాల్సి వస్తోంది. ఒకప్పుడు టీడీపీ, వైసీపీ పేరుతో విడివిడిగా లబ్ది పొందిన కాంట్రాక్టర్లు.. వైసీపీ సర్కార్ వైఖరి గమనించాక అంతా ఒక్కటైపోయారు. తద్వారా ప్రభుత్వానికి ఇబ్బందులు పెరుగుతున్నాయి.

చుక్కలు చూపిస్తున్న కాంట్రాక్టర్ల సిండికేట్
వైసీపీ సర్కార్ హయాంలో తొలుత పనులు పొందిన వారికి సైతం బిల్లులు సకాలంలో రాకపోవడం, ప్రభుత్వానికి సరఫరా చేసిన సామాగ్రి బిల్లులు క్లియర్ కాక, కోర్టులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతుండటం, ఇతరత్రా కారణాలతో కాంట్రాక్టర్లు ఇప్పుడు ఏకమై పోతున్నారు. దీంతో ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తున్నాయి.
తాజాగా రోడ్ల కాంట్రాక్టులు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినా డబ్బులు రావన్న అనుమానాలతో చాలా మంది వాటికి దూరంగా ఉండిపోయారు. చివరికి ఇంజనీర్లు బతిమాలుకుని ఒకరిద్దరిని దారికి తెచ్చుకుని పనులు పూర్తి చేశారు. కానీ మెజారిటీ కాంట్రాక్టర్లు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోతున్నారు.

విదేశీ బొగ్గు రివర్స్ టెండర్లకు షాక్
రాష్ట్రంలోని ధర్మల్ విద్యుత్ ప్లాంట్లకు విదేశీ బొగ్గు సరఫరా విషయంలో కాంట్రాక్టర్లు మరోసారి ఏకమైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి ముందు ఓ రేటు ఇచ్చి ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ నిర్వహించినా కనీస మొత్తం తగ్గించి ఈ రేటుకు కొనాల్సిందేనని చెప్తున్నారు. దీంతో ఏపీ జెన్ కో ఇప్పుడు విదేశీ బొగ్గును ఆ ధరకు కొనలేక, అలాగని కొనకుండా ఉండలేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చివరికి ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చేతుల్లో పెట్టేసింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగానే విదేశీ బొగ్గు కొనుగోలు ధర నిర్ణయం కానుంది.

జగన్ సర్కార్ కు రివర్స్ షాక్
ప్రస్తుతం విదేశీ బొగ్గును టన్ను 6-7 వేలకు ప్రభుత్వం కొంటోంది. దీన్ని ఇప్పుడు రూ.17,540 చొప్పున అమ్ముతామని ప్రభుత్వానికి కాంట్రాక్టు సంస్ధలు తేల్చిచెప్పాయి. వాస్తవానికి ముందు టెండర్లలో రూ.19500 చెప్పిన రేటును రివర్స్ టెండరింగ్ లో రూ.17540కి తగ్గించాయి. అలా అయినా ప్రభుత్వం మూడొంతులు ఎక్కువగా రేటు పెట్టి కొనాల్సిన పరిస్ధితి. ఇప్పుడు కొంటున్న రేటు ప్రకారం చూస్తే విద్యుత్ యూనిట్ రేటు రూ.4కి అమ్మాల్సి వస్తోంది.
ఇప్పుడు మూడొంతులు ఎక్కువగా ధరపెట్టి విదేశీ బొగ్గు కొనుగోలు చేస్తే ఆ మేరకు వినియోగదారులకు యూనిట్ రూ.12కు అమ్మాల్సి వస్తుంది. అది ఎట్టి పరిస్దితుల్లోనూ అసాధ్యం. దీంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది. అలాగని ధర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయలేక వాటిని నిలిపేస్తే కరెంటు కోతలు తప్పవు. దీంతో ఇప్పుడు బొగ్గు కొరత ఉన్నా, ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపేస్తున్నా అలాగే నెట్టుకొస్తోంది. ఆలోపు కాంట్రాక్టర్లతో లాబీయింగ్ కు ప్రయత్నిస్తోంది.