అమరావతి అసైన్డ్ భూముల స్కాంలో కొరడా: 5 మంది అరెస్ట్: ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి..!!
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు రెండోదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వేళ.. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు పాదయాత్రగా తరలి వెళ్లిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చింది. అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు అయిదుమందిని అరెస్ట్ చేశారు సీఐడీ అధికారులు.

60 రోజుల పాటు..
మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ మహా పాదయాత్రను ఆ ప్రాంత రైతులు చేపట్టారు. మొత్తం 60 రోజుల పాటు 630 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. అమరావతి పరిరక్షణ సమితి దీన్ని నిర్వహిస్తోంది. మూడు రాజధానులను బలంగా వ్యతిరేకిస్తోన్న తెలుగుదేశం, భారతీయ జనత పార్టీ, జనసేన, వామపక్ష నాయకులు ఈ పాదయాత్రకు మద్దతు ప్రకటించారు.

అరెస్టుల పర్వం..
పాదయాత్ర ఆరంభమైన రెండో రోజే అవినీతి నిరోధక విభాగం అధికారులు అరెస్టుల పర్వానికి తెర తీశారు. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడిన వారిలో ఇప్పటివరకు అయిదుమందిని అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, విశాఖపట్నం ఎంవీపీ కాలనీ, పీ అండ్ టీ కాలనీ, కిర్లంపూడి లేఅవుట్‌కు చెందిన చిక్కళ్ల విజయ సారథి, బడే ఆంజనేయులు, కొట్టి కృష్ణ దొరబాబును అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రధాన నిందితుడిగా
ఈ అసైన్డ్ భూముల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా మున్సిపల్ శాఖ మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేరును చేర్చారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన యలమాటి ప్రసాద్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో దర్యాప్తు సాగించినట్లు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం అక్రమంగా 1,100 ఎకరాల భూమిని సమీకరించారని పేర్కొన్నారు. ఈ కేసులో 169.27 ఎకరాల భూమి నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలను నిర్వహించినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు.

90 ఎకరాలు కొనుగోలు..
మాజీ మంత్రి నారాయణ సమీప బంధువులు ధూలిపాళ్ల వెంకట శివ పానకాల రావు, ఆయన భార్య పద్మావతి, కోడళ్లు డీ సృజన, లక్ష్మిశెట్టి సుజాత, లక్ష్మిశెట్టి సూర్య నారాయణ, అంబటి సీతారాము, లక్కాకుల హరిబాబు, లక్కాకుల పద్మావతి, చిక్కల్ల విజయ సారథి, పరుచూరి వెంకయ్య భాస్కర్ రావు, పరుచూరి వీ ప్రభాకర్ రావు, కొండయ్య బాలసుబ్రహ్మణ్యం, ఆయన భార్య కొండయ్య విజయ, కొండయ్య వెంకటేష్ 89.80 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

వేర్వేరు సర్వే నెంబర్లల్లో
అనంతవరం, కృష్ణయ్యపాలెం, కురగళ్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో వేర్వేరు సర్వేల్లో గల భూమిని వారు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్-1908లోని సెక్షన్ 22-ఏ ప్రకారం ఈ భూములను కొనుగోలు చేయడం నిషిద్ధమని వివరించారు.

రూ.15 కోట్లు..
మొత్తంగా వారి పేర్ల మీద 84 సేల్ డీడ్స్ ఉన్నాయని, యాగంటి శ్రీకాంత్, కొల్లి శివరాం, గుమ్మడి సురేష్ పేర్ల మీద జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఉన్నట్లు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో డాక్యుమెంట్లను సబ్మిట్ చేశారని అధికారులు చెప్పారు. పీ నారాయణ, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ డీల్ వెనుక మొత్తంగా 15 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గుర్తించారు అధికారులు. ఎస్సీ/ఎస్టీ/బీసీ రైతుల వద్ద నుంచి అతి తక్కువ ధరకు ఈ భూములను కొనుగోలు చేశారని అన్నారు.












Click it and Unblock the Notifications