floating bridge: ప్రారంభమైన మరుసటి రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి
విశాఖపట్నం: ఆర్కే బీచ్ రోడ్డులో ఆదివారం ప్రారంభించిన ఫ్లోటింగ్ (నీటిపై తేలియాడే) బ్రిడ్జి మరుసటి రోజు అంటే సోమవారం తెగిపోయింది. వీఎంఆర్డీయే నిధులు రూ. 1.60 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ వంతెనను వైసీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి అట్టహాసంగా ప్రారంభించారు.
ఆదివారం విశాఖ బీచ్ రోడ్డులో సుమారు 100 మంది సందర్శకులు నిలబడేలా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి సందర్శకులు అనుమతి ఇచ్చారు. పెద్దవారికి 100 రూపాయలు, చిన్నారులకు రూ. 70 చొప్పున టికెట్ ధర కేటాయించారు. అయితే, ఇంతలోనే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చివరి భాగం విడిపోయి సముద్రంలో కొంత దూరం కొట్టుకుపోవటంతో పర్యాటకులు తీవ్ర ఆందోన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పిందన్నారు.

కాగా, ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైపు ప్రజలు వెళ్లకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. నిర్వహణలో భాగంగానే వంతెన తెగిందని బ్రిడ్జ్ నిర్వహణ సంస్థ తెలిపింది. తెగిపోయిన చివరి భాగాన్ని తీసుకువచ్చి మరమ్మతులు చేసే పనిలో బ్రిడ్జ్ నిర్వాహకులు నిమగ్నమయ్యారు. అయితే ఈ బ్రిడ్జి బిగించిన ప్లాస్టిక్ బోల్ట్ భాగాలు అలల ఉద్ధృతికి విరిగిపోయి కనిపించడం గమనార్హం.
అయితే, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రారంభించిన రెండో రోజే తెగిపోవటంతో సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. బ్రిడ్జి తెగిపోయిన సమయంలో దానిపై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. విశాఖలో ఫ్లోటింగ్ బిడ్జ్ సక్రమంగా కట్టలేని ముఖ్యమంత్రి జగన్ రాజధాని కట్టగలిగే సత్తా ఉందంటే ప్రజలు నమ్ముతారా ? అని బీజేపీ ప్రశ్నించింది. విశాఖ ఆర్కే బీచ్లో ఫ్లోటింగ్ బిడ్జ్ నిర్మాణంలో అవినీతి వల్ల నాణ్యత లోపం తలెత్తి ప్రజల ప్రాణాల మీదకు తెచ్చారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ ధ్వజమెత్తారు. విశాఖలో ఇప్పుడు ఫ్లోటింగ్ బిడ్జ్ కూలిందని, త్వరలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పేక మేడలాగా కూలిపోతుందన్నారు.












Click it and Unblock the Notifications