నాడు ముంబై పేలుళ్లు..నేడు వైఎస్ జగన్ ప్రమాణానికి ఆర్జీవీ: ఎక్కడికెళ్లినా వాడుకోవడం కామన్!
విజయవాడ: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సినీ పరిశ్రమలో ఎంత మేధావిగా గుర్తింపు పొందారో.. బయటి ప్రపంచంలో అంతే వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి కార్యక్రమాన్నయినా.. చివరికి బాంబు పేలుళ్ల ఘటనలనైనా ఆయన సినిమా దృష్టితోనే చూస్తారు. ఆయా ఘటనల నుంచి కథను అల్లుకోవడం ఎలా? అనే దృష్టికోణంలోనే ఆయన ఆలోచిస్తారు. మొన్నటికి మొన్న ఆయన ప్రకటించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఆలోచన కూడా అలా పుట్టుకొచ్చిందే.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తాను విజయవాడకు వెళ్లగా.. రాయలసీమలో కనిపించే సుమోలు, ఆ తరహా వాతావరణం తనకు కనిపించిందని, అప్పుడే తనకు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే కథ స్ఫూరించిందని ఆయనే చెప్పుకొన్నారు.
అదలా వుంచితే- రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార పాసులు తనకు అందాయని చెప్పారు ఆర్జీవీ. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను వెళ్తున్నాననీ అన్నారు. ఉదయం 8 గంటల కల్లా విజయవాడలో ల్యాండ్ అవుతాననీ తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి తన వెంట వస్తున్నారని చెప్పారు. ఓ రాజకీయ కార్యక్రమానికి హాజరు కాబోతుండటం ఇదే తొలిసారి అని రామ్‌గోపాల్ వర్మ చెప్పారు.

గతంలో ముంబై బాంబు పేలుళ్ల సందర్భంగా కూడా రామ్‌గోపాల్ వర్మ హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. మరుసటి రోజే అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ను వెంట బెట్టుకుని మరీ బాంబు పేలుళ్లు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించారు. అప్పట్లో ఇది తీవ్ర దుమారాన్ని రేపింది. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌పై విరుచుకుపడ్డాయి ప్రతిపక్షాలు.
ఆయన ఎక్కడికి వెళ్లినా, ఏ కార్యక్రమానికి హాజరైనా సినిమా దృష్టితోనే చూస్తారనడానికి ఇదో ఉదాహరణ. ఈ సారి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ఎలాంటి రచ్చ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార సందడిని చూసి. ఇంకో సినిమాకు అవసరమైన మెటీరియల్‌ను తయారు చేసుకోగల సత్తా ఆయనకు ఉంది మరి! ప్రమాణ స్వీకార కార్యక్రమం నుంచి వచ్చిన తరువాత ఇలాంటిదేదైనా ఓ ప్రకటన వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదు.












Click it and Unblock the Notifications