ప్రస్తుతానికి మాములే.. రేపు ఏమవుతుందో చూడాలి
పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా, ఛత్తీస్‌గడ్ మీదుగా తెలంగాణ వరకు.. ఛత్తీస్‌గడ్ నుంచి మహారాష్ట్ర మీదుగా కొంకణ్ తీరం వరకు వేర్వేరు ద్రోణులు విస్తరించాయి. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. నైరుతు రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా, సీమల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి.
అప్రమత్తంగా ఉండాలి: అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, బాపట్ల జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, ప్రకాశం జిల్లా, విజయనగరం జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, తిరుపతి జిల్లా, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, వీటిపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

శాంతిపురంలో ఎక్కువ: చిత్తూరు జిల్లా శాంతిపురంలో 82.4, కడప జిల్లా సింహాద్రిపురంలో 70.2, కడప జిల్లా వల్లూరులో 68.4, చిత్తూరు జిల్లా పుంగనూరులో 65.2, విజయనగరం జిల్లా ఎస్ కోటలో 66.2 మిల్లీ మీటర్లు, శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరులో 58.8, కడప జిల్లా కమలాపురంలో 55.2, చిత్తూరు జిల్లా కుప్పంలో 52, తిరుపతి జిల్లా పాకాలలో 51.2, శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవచెరువులో 46.4, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 45.4, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 45.2, అనంతపురం జిల్లా శింగనమలలో 44.4, అనంతపురం జిల్లా ఉరవకొండలో 42.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రుతుపవనాల ఉపసంహరణ: నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుండి ఉపసంహరణ మొదలవగా అక్టోబర్ 15 నుంచి 20వ తేదీ మధ్యలో ఈ ప్రక్రియ పూర్తికానుంది. సెప్టెంబరు 17వ తేదీ నుంచే రుతుపవనాల ఉపసంహరణ మొదలుకావాల్సి ఉన్నప్పటికీ ఈ ఏడాది ఆలస్యమైంది. ప్రస్తుతం రాజస్థాన్‌లో పొడి వాతావరణం నెలకొంది. అలాగే గడచిన ఐదు రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో రుతుపవనాల నిష్క్రమణపై వాతావరణ శాఖ ప్రకటన చేసింది.












Click it and Unblock the Notifications