జగన్ ప్రభుత్వానికి మాజీ జేడీ కీలక సూచన - జనసేనకు ప్రశంసలు..!!
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. ఈ సమయంలో ఏపీలో మూడు రాజధానులు.. మంత్రుల కొత్త రాష్ట్రాల డిమాండ్లు రాజకీయంగా మరింత వేడి పెంచుతున్నాయి. ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. విశాఖను రాజధానిగా చేయకుంటే ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం డిమాండ్లు మంత్రుల నుంచే వినిపిస్తున్నాయి. ఈ సమయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇదే అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో తాను వద్దనుకొని బయటకు వచ్చిన జనసేన పైన ప్రశంసలు కురిపించారు.
ఏపీలో కొద్ది రోజులుగా ప్రత్యేక ఉత్తరాంధ్ర డిమాండ్ గురించి మంత్రులు పదే పదే ప్రస్తావిస్తున్నారు. మంత్రి ధర్మాన ఇదే అంశం పలు మార్లు ప్రస్తావించారు. విశాఖ రాజధాని చేయాలని డిమాండ్ చేసారు. ఇప్పుడు దీని పైన స్పందించిన లక్ష్మీనారాయణ ప్రత్యేక ఉత్తరాంధ్ర..మూడు రాజధానుల ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని వ్యాఖ్యానించారు. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధిరి ఆటంకాలు ఎదురవుతాయని అభిప్రాయ పడ్డారు. వీటికి బదులుగా ప్రత్యేక ఆర్దిక మండళ్లు ఏర్పాటు చేసి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి దిశగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఉత్తరాంధ్ర పరిధిలోని వనరుల ఆధారం గా పరిశ్రమలను నెలకొల్పితే ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు.

అదే విధంగా ఏపీలో మందస్తు ఎన్నికల పైనా కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. వైసీపీ ముఖ్య నేతలు మాత్రం తమకు అటువంటి ఆలోచన లేదని స్పష్టం చేస్తున్నారు. దీని పైన స్పందించిన లక్ష్మీనారాయణ ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదన్నారు. 2024లోనే ఎన్నికలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు. మధ్యంతర ఎన్నికలు ప్రజలపై మరింత భారం పెంచుతాయని చెప్పుకొచ్చారు. ఇక, రణస్థలంలో జనసేన నిర్వహించిన సభలో యువత పెద్ద సంఖ్యలో హాజరు కావటం..అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశ్నించటం శుభపరిణామంగా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీకి సిద్దం అవతున్న లక్ష్మీనారాయణ ఉత్తరాంధ్ర వ్యవహారాల పైన ప్రత్యేకంగా శ్రద్ద పెట్టారు.












Click it and Unblock the Notifications