కర్నూలు బస్సు ప్రమాదం వెనుక, పేలిన మొబైల్ ఫోన్లతోనే -ఒక్కసారిగా..!!
కర్నూలు బస్సు ప్రమాదం వెనుక విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 20 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. ఆ సమయంలో వచ్చిన నిప్పు రవ్వలు బస్సును వ్యాపించినట్లు తేల్చారు. అయితే, బస్సులో ఉన్న వందలాది మొబైల్ ఫోన్ల పార్సిల్ ఈ ప్రమాద తీవ్రతను పెంచినట్లు గుర్తించారు. ఈ పార్సిల్ నిబంధనలకు వ్యతిరేకమని అధికారులు చెబుతున్నారు. ఈ కోణంలోనూ ప్రస్తుతం విచారణ సాగుతోంది.
కర్నూలు ప్రమాదంలో జరిగిన బస్సు ప్రమాదం పైన విచారణ సాగుతోంది. బస్సు లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. ద్విచక్ర వాహనం బస్సును ఢీ కొట్టిన తరువా వచ్చిన నిప్పు రవ్వలు పార్మిల్ కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్‌కు సరిగ్గా పైన ఉండే సీట్లలో, బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది.

ఈ కారణంగానే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఘటనాస్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. లగేజీ క్యాబిన్‌లోని బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడం వల్లే భారీ శబ్దం వచ్చింది. అప్పటికే బస్సు దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుంది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకొనే ప్రయత్నం చేసినా కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు.
అయితే, నిబంధనల ప్రకారం ప్రయాణికుల వాహనాల్లో వారి వ్యక్తిగత లగేజీ తప్ప ఇతర సరకులేవీ రవాణా చేయకూడదు. కర్నూలు ఘటనలో కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలిందని ఫోరెన్సిక్ అధికారులు వెల్లడించారు. సాధారణంగా మొబైల్ ఫోన్ల పై భాగాన్ని ప్లాస్టిక్‌తో, బ్యాటరీలు లిథియంతో తయారు చేస్తారు. ప్లాస్టిక్ క్షణాల్లో అంటుకుంటుంది. లిథియం మంటల్లో చిక్కితే పేలిపోతుంది. వీటిని రవాణా చేయడం ఇంత భారీ ప్రాణనష్టానికి ప్రధాన కారణమైందని అధికారులు గుర్తించారు.












Click it and Unblock the Notifications