బ్యాంకుకు తాళాలు వేయడం మర్చిపోయారు:నంద్యాలలో డిసిసిబి సిబ్బంది నిర్వాకం...కేసులు నమోదు
కర్నూలు:నిర్లక్ష్యానికి పరాకాష్టగా ఈ ఉదంతాన్ని చెప్పుకోవచ్చు...ఏకంగా బ్యాంకుకే తాళాలు వేయడం మర్చిపోయి సిబ్బంది అంతా ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాల డిసిసి బ్యాంకు వద్ద చోటుచేసుకుంది.
ఇంటికి తాళం వేసినా సరే బద్దలుకొట్టి దోచుకుంటున్న రోజులివి...అలాంటిది ఏకంగా బ్యాంకుకే తాళాలు వేయడం మరచిపోయారంటే ఆ సిబ్బంది ఎంత కేర్ ఫుల్ గా జాబ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. గస్తీ తిరుగుతున్న పోలీసులు బ్యాంకు తలుపులు తెరిచి ఉండటం చూసి విషయం ఆరా తీస్తే అప్పుడు అసలు విషయం బైటపడింది. దీంతో బ్యాంకు సిబ్బందిపై పోలీసులు కేసునమోదు చేశారు.

కర్నూలు జిల్లా నంద్యాలలో గస్తీ తిరుగుతున్న పోలీసులకు తెల్లవారుఝాము సమయంలో పట్టణ శివారులోని శ్రీనివాసనగర్‌లో డిసిసి బ్యాంకు తలుపు తీసి ఉండటం కనిపించింది. ఈ టైమ్ లో బ్యాంకు తలుపు తీసి ఉండటం ఏమిటి?...దొంగనం ఏమైనా జరిగిందా అనే ఆందోళనతో పోలీసులు లోపల అంతా చెక్ చేశారు. అయితే ఎవరూ కనిపించకపోవడంతో ఏం జరిగిందో అర్థం కాక బ్యాంకు సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
వాళ్లు వచ్చాక అసలు విషయం తెలిసిన పోలీసులు నివ్వెరపోయారు. శనివారం బ్యాంకులో విధులు నిర్వహించిన సిబ్బంది సాయంత్రం తాళం వేయకుండా ఎవరికి వాళ్లు వెళ్లిపోయారు. అప్పటి నుంచి రాత్రంగా బ్యాంకు తలుపులు తెరిచే ఉన్నాయి. అలా సిబ్బంది మర్చిపోవడమో వేరే వారు వేస్తారనే ఉద్దేశ్యంతోనో ఎవరంతట వాళ్లు వెళ్లిపోవడం వల్లే ఆ పరిస్థితి ఉత్పన్నమైందని తెలుసుకున్న పోలీసులు బ్యాంకు ఉన్నతాధికారులను పిలిపించి తాళం వేయించారు.
అనంతరం ఈ ఘటనకు సంబంధించి బ్యాంకు మేనేజర్‌తో పాటు ఐదుగురు సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంకుకు తాళం వేయని సమయంలో
బ్యాంకులో కోటి రూపాయల మేర నగదుతో పాటు దాదాపు 350 మంది ఖాతాదారులకు చెందిన బంగారు ఆభరణాలు లాకరులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజల సొమ్ముకు భద్రత కల్పించడంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహించినందునే బ్యాంకు మేనేజరుతో పాటు సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications