రఘురామను హింసించిన మాజీ సీఐడీ అధికారి అరెస్ట్ ! నెక్స్ట్ వీరేనా ?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి రెబెల్ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుని రాజద్రోహం కేసులో అరెస్టు చేసి కస్టడీలో హింసించారు. ఈ వ్యవహారంలో అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ ను ఇవాళ రెండోసారి విచారణకు పిలిచిన పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం నుంచీ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగిన విచారణ అనంతరం ఆయన్ను అరెస్టు చేశారు.
వైసీపీ హయాంలో రఘురామకృష్ణంరాజును అరెస్టు చేశాక కస్టడీలో హింసించిన ఆరోపణలపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో సీఐడీ మాజీ ఏసీపీ విజయ్ పాల్ ను నిందితుడిగా చేర్చారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలని, ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆయన ఇవాళ ఒంగోలు ఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. సాయంత్రం వరకూ విచారణ తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

గతంలో రఘురామను టార్చర్ చేసిన కేసులో విజయ్ పాల్ తో పాటు ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, సునీల్ కుమార్ తో పాటు మాజీ సీఎం జగన్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిలో విజయ్ పాల్ ను అరెస్టు చేయడంతో త్వరలో మిగతా వారిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఐపీఎస్ లను ఈ కేసులో విచారణకు పిలవలేదు. అయినా విజయ్ పాల్ విచారణలో అప్పట్లో ఏం జరిగిందో చెప్పడంతో దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన్ను అరెస్టు చేసారు.












Click it and Unblock the Notifications