
2024 ఎన్నికల్లో పోటీ పై మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన..!!
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయంగా కీలక అంశాలు వెల్లడించారు. తన రాజకీయ భవిష్యత్ పైన స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు తిరిగి కలవటం పైన జరుగుతున్న చర్చ పైన ఆయన స్పందించారు. రెండు రాష్ట్రాలు కలవటం బాగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. అదే సమయంలో రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో ఉందన్నారు. అన్ని పార్టీలు కూర్చొని సమస్యల పైన చర్చిస్తే అన్ని పరిష్కారం అవుతాయని లక్ష్మీనారాయణ సూచించారు. ఇక, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశం పైన లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. పోటీ చేయటం ఖాయమని స్పష్టం చేసారు.

వచ్చే ఎన్నికల బరిలో నిలుస్తా..
2019 ఎన్నికల్లో జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో లక్షీనారాయణకు 2,88,874 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ నుంచి బరిలో నిలిచిన దగ్గుబాటి పురంధేశ్వరికి 33,892 ఓట్లు దక్కాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన బాలయ్య చిన్న అల్లుడు భరత్ కు 4,32,492 ఓట్లు పోలయ్యాయి. ఇక, వైసీపీ నుంచి పోటీ చేసిన ఎంవీవీ సత్యనారాయణకు 4,36,906 ఓట్లు రాగా, ఆయన విజయం సాధించారు. అయితే, ఈ సారి పొత్తులు ఖాయమని భావిస్తున్న వేళ..టీడీపీ - జనసేన కలిస్తే విశాఖ ఎంపీ సీటు కైవసం అవుతుందనే అంచనాలు రెండు పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. కానీ, పొత్తు గురించి రెండు పార్టీల్లో అంతర్గతంగా చర్చ సాగుతున్నా.. అధికారికంగా మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇదే సమయంలో జనసేన నుంచి బయటకు వచ్చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్ సభకే తిరిగి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

ఏ పార్టీ నుంచి బరిలో నిలుస్తారు..
మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తాను విశాఖ ఎంపీగానే పోటీ చేస్తానని చెప్పినా..ఏ పార్టీ అనేది స్పష్టత ఇవ్వటం లేదు. ఆయన వైసీపీలోకి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. బీజేపీ లేదా టీడీపీ లో ఒక పార్టీని ఎంచుకుంటారా లేక, తిరిగి జనసేనలోకి వెళ్తారా అనేది ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో చర్చకు కారణమవుతోంది. బీజేపీలోకి వెళ్లినా.. ఏపీలో ఆ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదనే అభిప్రాయం ఉంది. 2019 ఎన్నికల్లో పురంధేశ్వరి వంటి నేత విశాఖ నుంచి పోటీ చేస్తే కేవలం 33,982 ఓట్లు దక్కాయి. తిరిగి జనసేనలో చేరి పవన్ తో కలిసి పని చేయటానికి లక్ష్మీనారాయణ సిద్దంగా ఉన్నారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. పవన్ - లక్ష్మీనారాయణ మధ్య పెద్దగా విభేదాలు లేకపోయినా.. ఆ పార్టీని వీడి బయటకు వచ్చిన ఆయన తిరిగి అదే పార్టీలోకి వెళ్తారా అనేది సందేహమే. ఇక, టీడీపీ లో లక్ష్మీనారాయణ చేరే అంశం తేలాల్సి ఉంటుంది. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా మూడు రాజధానుల అంశం కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో విశాఖ టీడీపీ ముఖ్య నేతలు వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది.

విశాఖలో ముందస్తు ఏర్పాట్లతో..
2019 ఎన్నికల్లో ఓిడినా..విశాఖ పైన లక్ష్మీ నారాయణ ఆసక్తి కొనసాగుతోంది. తిరిగి అక్కడి నుంచే పోటీ చేయాలనే నిర్ణయంతో లక్ష్మీనారాయణ ఉన్నారు. ఏ పార్టీలో చేరకపోయినా..స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం తనకు ఉందని స్పష్టం చేసారు. కానీ, తాను పోటీలో ఉండటం ఖాయమని తేల్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా లక్ష్మీనారాయణ ఇప్పటికే కార్మికులకు మద్దతుగా ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక, స్థానికంగా తన మద్దతు పెంచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా తనకు విశాఖలోని సమీకరణాలు కలిసి వస్తాయని లక్ష్మీనారాయణ అంచనాతో ఉన్నారు. దీంతో..లక్షీనారాయణ విశాఖ నుంచి ఎంపీగానే పోటీ చేస్తానని స్పష్టత ఇవ్వటంతో..ఏ పార్టీ నుంచి చేస్తారు..లేక స్వతంత్ర అభ్యర్ధిగానే బరిలో దిగుతారా, అదే జరిగితే ఏ పార్టీ ఓట్ బ్యాంక్ కు నష్టం చేస్తారనేది ఇప్పుడు విశాఖ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ కు కారణమైంది.