వైసీపీలో సీబీఐ మాజీ జేడీ- విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దంటూ రియాక్ట్..!!
అమరావతి: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతోన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీలో చేరడానికి ఆయనకు ఆహ్వానం అందిందని, త్వరలోనే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ పార్టీ కండువా కప్పుకొంటారంటూ వార్తలొచ్చాయి.
దీనికి కారణాలు లేకపోలేదు. ఇటీవలే ఆయన శ్రీశైలంలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని దీనికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించడానికి ఆయనను కలిశారు. ఆ సమయంలో నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలూ అక్కడే ఉన్నారు.

అనంతరం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో లక్ష్మీనారాయణ.. జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను బహిరంగంగా మెచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేయడానికి ఉద్దేశించిన నాడు-నేడు, జగనన్న సురక్ష వంటి కార్యక్రమాలు పేదలకు మేలు చేస్తోన్నాయని చెప్పారు.
ఈ ప్రభుత్వం హయాంలో నాడు-నేడు కార్యక్రమం చక్కగా అమలవుతోందని, పాఠశాలలన్నీ అందంగా రూపుదిద్దుకున్నాయని, తాను చదువుకున్న స్కూలు కూడా ఊహించని విధంగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలకు మంచి ఆహారం అందించడం, అందులో రాగి జావను చేర్చడం అభినందనీయమని అన్నారు.
జగనన్న సురక్ష కింద డాక్టర్లే ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి.. వారికి వైద్య పరీక్షలు చేయడం మార్పునకు నిదర్శనమని, వారి ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించడం మంచి కార్యక్రమని చెప్పారు. ఈ ప్రభుత్వం చేస్తోన్న కృషిని అభినందిస్తోన్నానని లక్ష్మీనారాయణ అన్నారు. దీనితో- ఇక లక్ష్మీనారాయణ.. వైఎస్ఆర్సీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది.
దీనికి తాజాగా తెరదించారాయన. ఈ వార్తలను తోసిపుచ్చారు. శిల్పా చక్రపాణిరెడ్డిని కలవడానికి గల కారణాలను వివరించారు. పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ఆహ్వానించడానికే తాను ఆయనను కలిశానని చెప్పారు. అక్కడే వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి తనను ఆహ్వానించారని, ఆ సమావేశంలో జగనన్న సురక్ష, నాడు-నేడు కార్యక్రమాలను అభినందించానని పేర్కొన్నారు.
అంతమాత్రాన తాను అధికార పార్టీలో చేరుతున్నానని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదని లక్ష్మీనారాయణ తేల్చి చెప్పారు. ఈ ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదని, ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని అభ్యర్థిస్తున్నానని అన్నారు. ఓటర్ల చైతన్య కార్యక్రమాన్ని కొనసాగించే పోరుబాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications