వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం విరాళాల సేకరణ-జేడీ లక్ష్మీనారాయణ కీలక నిర్ణయం
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గదని తేలిపోయింది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పూర్తి స్ధాయిలో నడిపేందుకు మూలధనం సేకరణ కోసం బిడ్డింగ్ నిర్వహణ కూడా ఖాయమని అర్ధమైంది. ఈసారి మూలధన సేకరణ కోసం ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం ఏప్రిల్ 20వరకూ బిడ్ల కోసం ఆసక్తి వ్యక్తీకరణ చేసే గడువు కూడా పెంచింది. ఈ నేపథ్యంలో ఇవాళ బిడ్ దాఖలు చేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మూలధనం సమకూర్చడం ద్వారా తయారైన స్టీల్ తీసుకునేందుకు ఈసారి బిడ్లకు ఆసక్తివ్యక్తీకరణ కోరగా.. దీనికి మరో అడుగు ముందుకేసి స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు విరాళాలు సేకరించి ఆ మొత్తం తామే ఇవ్వాలని వీవీ లక్ష్మీనారాయణ నిర్ణయించారు. ఇందుకోసం విశాఖలో విరాళాలు సేకరించాలని ఆయన నిర్ణయించారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ల వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయింది.

ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ చేసిన జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ తెలుగు వారందరికీ బిడ్డ లాంటిదని, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇందుకోసమే తాను వైజాగ్ స్టీల్ బిడ్ దాఖలు చేశానన్నారు. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ బిడ్ కు కొత్త విధానంలో నిధులు సేకరించబోతున్నట్లు వీవీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. దీంతో ఈ కొత్త విధానంపై చర్చ మొదలైంది.
వీవీ లక్ష్మీనారాయణ చెబుతున్న కొత్త విధానం ప్రకారం క్రౌడ్ ఫండింగ్, డిజిటల్ ట్రాన్స్ ఫర్ వంటి విధానాల్లో నిధులు విరాళాల రూపంలో సేకరించబోతున్నారు. 8.5 కోట్ల మంది నెలకు వంద రూపాయల చొప్పున ఇస్తే రూ.850 కోట్లు జమ అవుతాయని, ఇలా నాలుగు నెలల పాటు ఇస్తే స్టీల్ ప్లాంట్ కోసం అవసరమైన బిడ్డింగ్ మొత్తం సమీకరించవచ్చని సీబీఐ మాజీ జేడీ తెలిపారు. దీంతో ఇప్పుడు వీవీ లక్ష్మీనారాయణ విరాళాల సేకరణ ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications