YS Sharmila : వైఎస్ షర్మిల ఎంట్రీపై కాంగ్రెస్ మాజీ ఎంపీ యూటర్న్!
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఓవైపు జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పార్టీలు వ్యూహాలు మార్చుకుంటున్నాయి. ఇదే క్రమంలో వైఎస్సార్ వారసురాలు, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు అయిన వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చే ప్రయత్నాలు జోరందుకున్నాయి. అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం అంతా ఒట్టిదేనని గతంలో వ్యాఖ్యానించిన ఆ పార్టీ మాజీ ఎంపీ ఇవాళ యూటర్న్ తీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల ఎంట్రీపై ఇప్పటికే మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సహా పలువురు నేతలు స్పందించారు. వీరంతా దివంగత కాంగ్రెస్ నేత వైఎస్ వారసురాలిగా ఆమె ఎంట్రీని ఆహ్వానిస్తున్నారు. షర్మిల పార్టీలోకి వస్తే కాంగ్రెస్ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల ఎంట్రీ వార్తలు అంతా అబద్ధమంటూ గతంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ ఖండించారు. దీంతో ఈ ప్రచారం విషయంలో గందరగోళం నెలకొంది.

అయితే ఇవాళ మాత్రం ఆయన యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. వైఎస్ షర్మిలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చింతామోహన్ తెలిపారు. తద్వారా షర్మిల ఎంట్రీ వార్త నిజమేనని ఆయన పరోక్షంగా చెప్పినట్లయింది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు షర్మిల ఎంట్రీని ఆహ్వానిస్తున్న నేపథ్యంలో చింతామోహన్ కూడా ఇప్పుడు ఆమెకు ఆహ్వానం పలికారు.
మరోవైపు ఏపీలో వైసీపీ పాలనపై స్పందించిన చింతామోహన్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆపార్టీకి 20 సీట్లు కంటే ఎక్కువగా రావడం కష్టమే అన్నారు. అలాగే పవన్‌ను చూస్తే జాలి వేస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ యాత్ర థీమ్ లేకుండా రాజకీయాల్లోకి రావడం చూస్తుంటే సందేశం లేని సినిమాలా ఉందన్నారు. ఏపీలో ఈసారి కాంగ్రెస్ పార్టీ 25 ఎంపీ సీట్లలో 15 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయం కచ్చితంగా మారబోతుందన్నారు.












Click it and Unblock the Notifications