రాజధానిగా అమరావతిపై ఉత్తరాంధ్ర ప్రజల నాడి పట్టిన జీవీ హర్షకుమార్..!!
అమరావతి: అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తోన్న వేళ.. దీనికి వ్యతిరేకంగా మూడు రాజధానుల కోసం మిగిలిన జిల్లాల ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమాన్ని లేవనెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు జీవీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు, అమరావతిపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారాయన.

ఎలా నమ్ముతారు?
మంత్రి బొత్స సత్యనారాయణ అయినా, ధర్మాన ప్రసాద రావు అయినా అధికారంలోకి వచ్చిన తరువాత ఏనాడూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని జీవీ హర్షకుమార్ గుర్తు చేశారు. కనీసం రైల్వే జోన్ గురించీ పట్టించుకోలేదని విమర్శించారు. అలాంటి నాయకులు ఇప్పుడు మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, విశాఖపట్నం ప్రజల నాడి తనకు బాగా తెలుసని, ఎవ్వరూ కూడా మూడు రాజధానులను కోరుకోవట్లేదని అన్నారు.

విశాఖ ప్రజలు కోరుకోవట్లేదు..
ఉత్తరాంధ్రలోని అతిపెద్ద నగరం విశాఖపట్నాన్ని రాజధానిగా స్థానిక ప్రజలు స్వాగతించట్లేదని జీవీ హర్షకుమార్ స్పష్టం చేశారు. మూడు రాజధానుల కోసం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏక్కడే గానీ ఓ చిన్న ఉద్యమం కూడా మొదలు కాలేదని అన్నారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఏ స్థాయిలో స్పందించారో తాము చూశామని, విశాఖపట్నం రాజధాని గురించి ఒక్కరు కూడా సమావేశాలు పెట్టలేదని అన్నారు.

డ్రామాలకు బదులుగా..
ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటనలు చేయడం అంటే రెచ్చగొట్టడమేనని జీవీ హర్షకుమార్ ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు చేసే ఈ ప్రయత్నాలన్నీ బెడిసి కొడతాయని స్పష్టం చేశారు. ఇలాంటి డ్రామాలను కట్టిబెట్టి, ఇప్పటికైనా ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన హామీలు, రాష్ట్రానికి రావల్సిన ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులకు సూచించారు.

బలవంతపు రాజీనామాలు..
ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధాని కావాలన్న కోరిక లేదని, రాజీనామాల వ్యవహారం అనేది వైసీపీ నాయకులు చేయిస్తోన్నబలవంతపు ఉద్యమంగా జీవీ హర్షకుమార్ అభివర్ణించారు. చివరికి వైసీపీ నేతలు కూడా విశాఖపట్నాన్ని రాజధానిగా కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. విశాఖ రాజధాని కోసం మూడు సంవత్సరాలుగా రాజీనామా చేయని నేతలు ఇప్పుడే ఆ పని చేస్తోన్నారని హర్షకుమార్ నిలదీశారు.

జగన్ ఒత్తిడితోనే..
వైసీపీ నేతలెవరూ రాజీనామాలకు సుముఖంగా లేనప్పటికీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారితో బలవంతంగా ఆ పని చేయిస్తున్నారని అన్నారు. తాము ఏకైక రాజధానికే కట్టుబడి ఉన్నామని, రాజకీయేతర ఐక్యకార్యాచరణ కమిటీతో తాము కలవట్లేదని హర్షకుమార్ తేల్చి చెప్పారు. ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టిన కేసీఆర్ జాతీయ పార్టీ ఎలా పెట్టారంటే తాను సిగ్గుపడుతున్నానని, ప్రజల మధ్య చిచ్చు పెట్టే కేసీఆర్ వంటి నాయకులు జాతీయ స్థాయి రాజకీయాల్లో రాణించలేరని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications