కేబుల్ టీవీ దిగ్గజం, హాత్ వే రాజశేఖర్ కన్నుమూత....
హాత్‌వే డిజిటల్ కేబుల్ మాజీ డైరెక్టర్,వెంకటసాయి మీడియా సంస్థ అధినేత చెలికాని రాజశేఖర్ శనివారం(అగస్టు 29) ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు సమాచారం. రాజశేఖర్ మరణం ఆయన కుటుంబంతో పాటు మీడియాలోని ఎంతోమంది ఆయన ఆప్తులను విషాదంలో ముంచెత్తింది.
విజయనగరం జిల్లా సీతానగరంకు చెందిన రాజశేఖర్ 30 ఏళ్ల క్రితం కేబుల్ టీవీ రంగంలోకి ప్రవేశించారు. ఈ రంగంలో ఉమ్మడి ఏపీలో అగ్రగామిగా ఉన్న హాత్‌వే కంపెనీ డైరెక్టర్‌గా చాలా కాలం పనిచేశారు. అందుకే ఆయనకు హాత్‌వే రాజశేఖర్ అన్న పేరు స్థిరపడిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌వోల సంఘం అధ్యక్షుడిగానూ రాజశేఖర్ పనిచేశారు. ఆల్‌ఇండియా బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. రెండేళ్ల క్రితం హాత్ వే నుంచి బయటకొచ్చిన ఆయన ఎగ్జయిటైల్ అనే కంపెనీలో చేరారు.

రాజశేఖర్ మృతి పట్ల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేబుల్ రంగంలో రాజశేఖర్ తనదైన ముద్ర వేశారని అన్నారు. కేబుల్ ఆపరేటర్ల సంక్షేమం కోసం ఆయన చాలా కృషి చేశారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లోని కేబుల్ ఆపరేటర్స్ కూడా ఆయన మృతి సంతాపం తెలియజేశారు.












Click it and Unblock the Notifications