AB Venkateswara Rao : జగన్ సర్కార్ షోకాజ్ కు ఘాటు రిప్లై-నిబంధనలకు లోబడే ప్రెస్ మీట్
ఏపీలో మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకూ, వైసీపీ సర్కార్ కూ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా గతంలో నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ వైసీపీ ప్రభుత్వంలో భాగస్వాములైన కొందరిపై ఆయన ప్రెస్ మీట్ పెట్టి మండిపడ్డారు. ప్రభుత్వం తనపై కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ లో లేని వివరాలను దుష్ప్రచారం చేశారంటూ విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. దానికి ఇవాళ ఏబీ వివరణ పంపారు.
ప్రెస్ మీట్లో ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎస్ సమీర్ శర్మ తాజాగా షోకాజ్ నోటీసు పంపారు. ఇందులో వారం రోజుల్లో వివరణ ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఏబీ.. ఇవాళ వివరణ పంపారు. ఇందులో ఆయన కూడా ఘాటుగా స్పందించారు. మీడియా సమావేశం నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన నోటీసుకు ఇచ్చిన సమాధానంలో.. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయని పేర్కొన్నారు. తనకు ఇచ్చిన నోటీసులోనే పేర్కొన్న రూల్ 17 నియమానికి అనుగుణంగా నే తాను మీడియాతో మాట్లాడినట్లు ఏబీ తెలిపారు.

తాను ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉండగా పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగించలేదని మాత్రమే చెప్పానని సీఎస్ కు పంపిన వివరణలో ఏబీ తెలిపారు. ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం అధికారిక అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఆయన గుర్తుచేశారు. రూల్ నెంబర్ 3 ప్రకారం అధికారులు పారదర్శకంగా, జవాబుదారీతనం గా ఉండాలని ఏబీ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని మాత్రమే రూల్స్ చెపుతున్నాయని, మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదని ఏబీ గుర్తుచేశారు. గౌరవానికి భంగం కలిగించేలా తనపై, కుటుంబం పై ఆరోపణలు చేస్తే స్పందించకుండా ఎలా ఉంటానని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం లభించిన ప్రాధమిక హక్కు మేరకు వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అయినా మీడియా సమావేశం పెడుతున్న విషయాన్ని ముందుగానే ప్రభుత్వానికి తెలిపానన్నారు. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన ట్వీట్ ను కూడా వివరణలో ఏబీ వెంకటేశ్వరరావు జత చేశారు.












Click it and Unblock the Notifications