Nara Brahmani : నారా బ్రాహ్మణి పగ్గాలు చేపట్టేది అప్పుడే ? అయ్యన్నపాత్రుడు హింట్..!
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. స్కిల్ స్కాంలో చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ.. ఈ కేసులో ఆయన బయటపడినా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాలు, ఏపీ ఫైబర్ నెట్ స్కాం వంటి ఇతర కేసుల్లో ఆయన్ను అరెస్టు చేసి జైల్లోనే కొనసాగించేందుకు సిద్దమవుతోంది. అంతే కాదు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను కూడా త్వరలో అరెస్టు చేస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తర్వాత లోకేష్ కూడా అరెస్టు అయితే ఏం జరగబోతోందో అయన్న జోస్యం చెప్పారు. చంద్రబాబు అరెస్టు కు నిరసనగా ఇప్పటికే జనంలోకి వెళ్లి నిరసనలు చేపడుతున్న ఆయన కోడలు నారా బ్రాహ్మణి పగ్గాలు తీసుకునే అవకాశం ఉందని అయ్యన్న సూత్రప్రాయంగా వెల్లడించారు. దీంతో టీడీపీ పగ్గాలు బ్రాహ్మణి చేతుల్లోకి వెళ్లబోతున్నాయంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లయింది.

చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో గన్నవరంలో టీడీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేషన్ కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతుందని ఆయన తెలిపారు. అయినా టీడీపీ నాయకత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. లోకేష్ అరెస్ట్ అయితే బ్రాహ్మణి నాయకత్వంలో పార్టీ నడుస్తుందన్నారు.టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొందని, ఢిల్లీలో పార్టీ నేతల సమావేశంలో ఇప్పటికే తన అభిప్రాయం చెప్పినట్లు అయ్యన్న వెల్లడించారు.
చంద్రబాబు అరెస్టుపై ఇప్పటికే ఆయన భార్య భువనేశ్వరితో కలిసి నిరసనల్లో పాల్గొంటున్న నారా బ్రాహ్మణిపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న బ్రాహ్మణి చంద్రబాబు అరెస్టు తర్వాత జనాల్లోకి వస్తుండటంతో ఆమెను వైసీపీ ఇప్పటికే టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు లోకేష్ అరెస్టు ప్రచారం నేపథ్యంలో బ్రాహ్మణి ఎంట్రీ పై ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో అయన్నపాత్రుడు కామెంట్స్ చూస్తుంటే బ్రాహ్మణి ఎంట్రీ తప్పేలా లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications