YCP ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే తల ఎత్తుకుని తిరిగే వాడినా: నా కుమారుడికి మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు
YSRCP: ఏపీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ బలహీన పడిందనుకున్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమిస్తోంది.
అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో పొత్తు సైతం పెట్టుకుంది. ప్రస్తుతం సీట్ల పంపకాల దశలో ఉంది ఈ రెండు పార్టీల పొత్తుల వ్యవహారం.

ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీపై మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఘాటు విమర్శలు చేశారు. కారంచేడులో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో పరాజయం పాలయ్యారు.
ఆ విషయాన్ని ఆయన తాజాగా ప్రస్తావించారు. పర్చూరు ఓటర్లు తనను ఓడించి మంచి పని చేశారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. అప్పట్లో గెలిచి ఉంటే ఇప్పుడిలా ఓటర్ల ముందు స్వేచ్ఛగా తిరిగేవాడిని కాదని పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా రోడ్లు వేయలేదంటూ తనను ఇప్పటికీ గుర్తు చేస్తోన్నారని అన్నారు.
వైఎస్ఆర్సీపీ చేస్తోన్న రాజకీయాలు తన వ్యక్తిత్వానికి తగవనే కారణంతో ఆ భగవంతుడే తనను ఓడించాడని దగ్గుబాటి వ్యాఖ్యానించారు. ఓడిన తరువాత జగన్ తనను పిలిపించి తన కుమారుడిని ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చాడని, అది కూడా సాధ్యం కాలేదని పేర్కొన్నారు.
మీరు ఆరోజు గెలిపించి వుంటే నేను ఈరోజు మీ ముందర తిరిగేవాడిని కాదు: దగ్గుబాటి#DaggubatiVenkateswaraRao #PurandeswariBJP #DaggubatiPurandeswari #BJP #Oneindiatelugu pic.twitter.com/YVmFHOMZPF
— oneindiatelugu (@oneindiatelugu) December 25, 2023
ఆయన భార్య, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడానికి గల కారణాన్నీ వివరించారు దగ్గుబాటి. కేంద్రమంత్రి స్థాయిలో పని చేసిన తరువాత పార్టీ మారడానికి ఇష్టపడలేదని, ఇక్కడితో ఆపేద్దామని అనుకున్నామని అన్నారు. బలవంతంగా బీజేపీలో చేరాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications