చంద్రబాబు సెక్యూరిటీపై కామెంట్స్-తమ్మినేనిపై సుమోటో కేసుకు దేవినేని ఉమ ఫిర్యాదు
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ పొలిటికల్ వార్ లో తాజాగా మరోసారి చంద్రబాబు భద్రత అంశం తెరపైకి వచ్చింది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓసారి చంద్రబాబు భద్రత తగ్గించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించి దాన్ని కొనసాగించే ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబు భద్రత తీసేయాలంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ మండిపడుతోంది.
చంద్రబాబు భద్రతపై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ వ్యాఖ్యలు ఇప్పటికే కౌంటర్లు వేస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ తమ్మినేనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఆయన నిన్న సాయంత్రం మైలవరం పిఎస్ లో ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు స్పీకర్ తమ్మినేని సీతారాంపై సుమోటోగా కేసు బుక్ చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమ మైలవరం ఎస్.హెచ్.ఓకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.

చంద్రబాబుకి ఉన్న జెడ్ ప్లస్ సెక్యూరిటీ తీసివేయమని, మేము ఫినిష్ చేస్తాం అని స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం మాట్లాడారని దేవినేని ఆరోపించారు. ఇది మనుషులు మాట్లాడే భాష కాదని, ... పశువులకు గొంతు ఉంటే ఆ భాష మాట్లాడవన్నారు. ఫినిష్ అయిపోతావ్ సెక్యూరిటీ తీసివేయండి అని బాధ్యతాయుతమైన స్పీకర్ స్థానంలో ఉండి ఆ భాష మాట్లాడావు అంటే ఆ స్థానంలో ఉండే నైతిక అర్హత తమ్మినేనికి లేదన్నారు.
తమ్మినేని సీతారాం చదువుకున్న డిగ్రీల పై కూడా మీడియాలో చాలా కథనాలు వచ్చాయని, ఆ సమాచారం అంతా ప్రజలకు తెలుసని దేవినేని వ్యాఖ్యానించారు. రాజీనామా చేయకుండా స్పీకర్ పదవిలో ఉండి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తే ఫ్రస్టేషన్ లో ఉండి మాట్లాడుతున్నారన్నారు. బాబాయి హత్య ముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుసని సీబీఐ చార్జిషీట్ వేసిందని విమర్శించారు. ఆముదాలవలసలో కూన రవికుమార్, వర్ల రామయ్య ఇప్పటికే స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలపై డీజీపీకి లేఖ రాశారని దేవినేని తెలిపారు. వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాంపై సుమోటోగా కేసు బుక్ చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications