ఐటీ నోటీసుల వేళ.. చంద్రబాబుపై మరో బాంబు పేల్చిన పేర్ని నాని
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. చంద్రబాబు జీవితం మొత్తం దోపిడీమయమేనని, ఇప్పుడు దొరికిపోయాడని అన్నారు. దీనిపై ఇప్పటివరకు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఇప్పటివరకు తిన్న దానిలో దొరికింది 118 కోట్ల రూపాయలేనని, దొరక్కుండా ఎంత తిన్నాడో బయటికి వస్తుందని అన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నాడని ధ్వజమెత్తారు.

తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులను అప్పగించిన ప్రతి కాంట్రాక్ట్ సంస్థ నుంచి చంద్రబాబు భారీగా ముడుపులు తీసుకున్నాడని విమర్శించారు. అందులో కొంత మొత్తం అంటే 118,98,13,207 కోట్ల రూపాయల లంచాన్ని తీసుకున్నట్లు ఐటీ శాఖ గుర్తించిందని వివరించారు. అమరావతి పేరుతో ఇంకా ఎన్ని కోట్ల రూపాయలను దిగమింగాడో త్వరలోనే తేలుతుందని చెప్పారు.
విశాఖపట్నం వంటి అభివృద్ధి నగరాలు ఉండగా.. కేవలం దోచుకోవాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు రాజధాని అమరావతి ప్రతిపాదనలను తెర మీదికి తీసుకొచ్చారని పేర్నినాని తేల్చి చెప్పారు. ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ కంపెనీలతో పాటు ఇతర కాంట్రాక్ట్ సంస్థల నుంచి లంచాన్ని తీసుకోవడానికి చంద్రబాబు డొల్ల కంపెనీలను సృష్టించినట్లు ఐటీ శాఖ నిర్ధారించినట్లు పేర్నినాని పేర్కొన్నారు.

చంద్రబాబు తన వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ద్వారా ఈ అక్రమ ఆర్థిక లావాదేవీలను నిర్వహించినట్లు వివరించారు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన విషయాన్ని దినపత్రికల్లో వచ్చినా కూడా ఇప్పటివరకూ ఎవరూ ఎందుకు స్పందించట్లేదని పేర్నినాని ప్రశ్నించారు. చంద్రబాబు గానీ, ఆయన ఎల్లో మీడియా గానీ ఏమయ్యారని నిలదీశారు.
చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులను జారీ చేయడంపై ఎల్లో మీడియా ఎందుకు మాట్లాడట్లేదంటూ పేర్ని నాని ప్రశ్నించారు. జగన్ ఇంట్లో గానీ, ప్రధానిని కలిసినప్పుడు గానీ- ఏం మాట్లాడుకున్నారో తెలుసుకునే సామర్థ్యం ఉన్న ఈ ఎల్లో మీడియాకు చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడాన్ని ఎందుకు పసిగట్టలేకపోయిందంటూ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications