
వీకెండ్ ప్రజా సేవకుడు: జూ.ఎన్టీఆర్ సినిమా పేరు పవన్ కల్యాణ్‌కు సరిపోద్ది: పేర్ని నాని
పవన్ కల్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. నెలలో రెండు వారాలు పవన్ కల్యాణ్ ప్రజాసేవ చేస్తోన్నారంటూ ఎద్దేవా చేశారు. ఆదివారం, ఆదివారం ప్రజాసేవ చేస్తోన్నానంటూ జనం ముందుకు వస్తోన్నారని అన్నారు. తాను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానంటూ 2019 నాటి సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ డబ్బా కొట్టుకున్నాడని, ఆ తరువాత పార్ట్‌టైమ్ పొలిటీషియన్‌లా అయ్యాడని ధ్వజమెత్తారు.

పేర్ని నాని కౌంటర్ అటాక్..
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఘాటు విమర్శలు సంధించారు. ఈ ఆదివారం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో నిర్వహించిన జనసేన-జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై ఎదరు దాడి సాగించారు. కౌంటర్ అటాక్‌కు దిగారు. నెలలో రెండు ఆదివారాల పాటు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పవన్ కల్యాణ్ వీకెండ్ ప్రజాసేవ చేస్తోన్నారంటూ మండిపడ్డారు.

డబ్బుల కోసం
డబ్బుల కోసం ప్రజా సేవ చేస్తోన్నానంటూ ఎన్నికల అనంతరం పవన్ కల్యాణ్ చెప్పుకొన్నాడని విమర్శించారు. ఇప్పుడు వీకెండ్ ప్రజాసేవకుడిగా మారడాని అన్నారు. అలాగనీ ప్రతివారం కూడా ఆయన ప్రజా సేవ చేయడానికి ముందుకు రావట్లేదని గుర్తు చేశారు. పక్షం రోజులకోసారి ప్రజల ముందుకు వస్తోన్నాడని పేర్నినాని చెప్పారు. సెలవు రోజుల్లో ప్రజా సేవ చేస్తోన్నాడని ధ్వజమెత్తారు. ప్రజలకు సేవ చేయడంలో కూడా పవన్ కల్యాణ్ సరికొత్త పద్ధతులను అనుసరిస్తోన్నాడని, అవి భలేగున్నాయ్ అంటూ చురకలు అంటించారు.

ప్రజా సేవకు అంకితం చేయడం అంటే ఇదేనా..?
తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయడం అంటే ఇదేనా? అని పేర్ని నాని నిలదీశారు. ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల రాబడిని వదులుకుని తాను ప్రజలకు సేవ చేయడానికి వచ్చానంటూ పవన్ కల్యాణ్ డబ్బా కొట్టుకుంటున్నాడని అన్నారు. ఇలాంటి వింత పోకడలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా వస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరని, దీన్ని చరిత్రలో రాయాల్సిందేనని చెప్పారు. పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్స్‌కు ఆలస్యంగా వెళ్తుంటాడనే ప్రచారం ఉందని, రాజకీయాల్లో కూడా ఆలస్యంగా వస్తోన్నాడని అన్నారు.

విషకూటమి ప్రభుత్వం కాదు..
చంద్రబాబు నాయుడు-భారతీయ జనతా పార్టీ-పవన్ కల్యాణ్ అనే విషకూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు మూడేళ్ల కిందటే పడదోశారని పేర్ని నాని గుర్తు చేశారు. ఇంకా చంద్రబాబే ముఖ్యమంత్రి అని పవన్ కల్యాణ్ అనుకుంటున్నాడని, ఆయన దిగిపోయి చాన్నాళ్లే అయిందని చెప్పారు. గతంలో తాను ప్రసంగాలు, ఇతర వీడియోలను ఒక్కసారి పవన్ కల్యాణ్ తిరగేసుకుని చూస్తే.. తానేమిటో అర్థమైపోతుందని అన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ను ఒక్కసారి చూస్తే.. ఆయన మీద ఆయనే అసహ్యం వేస్తుందని చెప్పారు.

ఆ సినిమా పేరు..
ఊసరవెల్లి కూడా ఒకట్రెండు రంగులను మాత్రమే మారుస్తుందని, పవన్ కల్యాణ్ మాత్రం దాన్ని మించిపోయాడని పేర్ని నాని అన్నారు. ఇదివరకు ఊసరవెల్లి అనే టైటిల్‌తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా తీశారని, నిజానికి- అది పవన్ కల్యాణ్‌కు బాగా సరిపోతుందని ఎద్దేవా చేశారు. దానికి సీక్వెల్‌గా ఊసరవెల్లి-2 అనే సినిమా తీయొచ్చని సలహా ఇచ్చారాయన. అమ్మ రాజీనామా అంటూ తమపై దాడి చేయడం కాదని, విజయమ్మ ఎందుకు రాజీనామా చేశారో స్పష్టం చేశారనీ పేర్నినాని గుర్తు చేశారు.