మొహమాటం లేకుండా ఈ మాట చెబుతున్నా- టీడీపీ మాజీ మంత్రి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏ ఒక్క పనీ చేయొద్దని ఆదేశించారు. తానీ విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా చెబుతున్నానని, ప్రత్యర్థి పార్టీలకు ఎటువంటి పనీ చేసిపెట్టొద్దని అన్నారు.
తుని నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలతో యనమల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.

రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తోందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆ పార్టీ వాళ్లు అడిగారని ఏవైనా పనులు చేసిపెడితే దాని వల్ల తెలుగుదేశం పార్టీకే నష్టం వాటిల్లుతుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు గానీ, కార్యకర్తలు గానీ ఎవరు వచ్చి ఏ పని అడిగినా చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఈ విషయం గట్టిగా చెబుతున్నానని అన్నారు.
ఈ విషయంలో తన సొంత ఇంట్లో వాళ్లు చెబితనే చేయనని తెగేసి చెప్పానని యనమల పేర్కొన్నారు. అంత కఠినంగా ఉంటేనే తెలుగుదేశం పార్టీ బలోపేతమౌతుందని అన్నారు. ఒకసారి చెయ్యనని గట్టిగా చెబితే మళ్లీ రెండోసారి వాళ్లు పనుల కోసం రాబోరని, ఒకసారి చేసిపెడితే వస్తూనే ఉంటారని వ్యాఖ్యానించారు.
వైసీపీ నాయకులు గానీ, కార్యకర్తలు గానీ తమ పార్టీలో చేరతామంటేనే వాళ్లకు పనులు చేసే విషయంపై ఆలోచన చేయాలని యనమల సూచించారు. ఎవరు పడితే వాళ్లు పార్టీలోకి వస్తామంటే చేర్చుకోబోమని, వాళ్ల క్యారెక్టర్, ప్రజల్లో ఉన్న పలుకుబడి ఆధారంగానే చేర్చుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications