వైసీపీకి మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా?: పవన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్‌గా
Grandhi Srinivas: ఇటీవలే జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. అనేక జిల్లాల్లో ఆ పార్టీని ఖాళీ అవుతోంది. బడా నాయకులు సైతం గుడ్‌బై చెబుతున్నారు. మాజీ మంత్రులు-ఎంపీలు- ఎమ్మెల్యేలు- ఎమ్మెల్సీలు వరుస కట్టి బయటికెళ్తోన్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ శాసన సభ్యుడు పెండెం దొరబాబు.. పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య వైసీపీని వీడారు. టీడీపీలో చేరారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ విప్ సామినేని ఉదయభాను.. భారీ షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేశారు. వారిద్దరూ జనసేన కండువా కప్పుకొన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య సైతం జగన్ పార్టీకి గుడ్‌బై చెప్పారు.
కొద్దిసేపటి కిందటే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ జాబితాలో చేరారు. వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, దీనివల్ల భీమిలి నియోజకవర్గం ఇన్‌ఛార్జి బాధ్యతలు, వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తోన్నానంటూ జగన్‌కు లేఖ రాశారు. దీన్ని ఆమోదించాల్సిందిగా కోరారు.
అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే భీమవరానికి చెందిన మాజీ శాసన సభ్యుడు గ్రంధి శ్రీనివాస్ కూడా అదే బాట పట్టారు. పార్టీని వీడారు. ఆమోదం కోసం తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే ఆయనా పార్టీని వీడినట్లు సమాచారం.
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేశారు గ్రంధి శ్రీనివాస్. జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు చేతిలో ఓటమిపాలయ్యారు. 66 వేలకు పైగా ఓట్ల తేడాతో చిత్తయ్యారు. ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటోన్నారు. అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోన్నారు. ఈ క్రమంలో రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
అంతకుముందు- 2019 నాటి ఎన్నికల్లో ఇదే భీమవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయఢంకా మోగించారాయన. స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడించారు. పార్టీలో జెయింట్ కిల్లర్‌గా గుర్తింపు పొందారు. కొంతకాలంగా పార్టీ అగ్రనాయకత్వంపై అసహనంతో ఉంటోన్నారని, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులను విడిపించే విషయంలో పార్టీ జోక్యం చేసుకోవట్లేదంటూ బహిరంగంగానే విమర్శించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications