వైసీపీలోకి నిమ్మల కిష్టప్ప?
TDP Janasena BJP alliance: వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ.. జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తోంది.
టీడీపీ, జనసేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ఆశావహులు, మాజీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు. పలువురు సీనియర్లు గుడ్‌బై చెబుతున్నారు. వారంతా పార్టీకి రాజీనామాలు చేస్తోన్నారు. ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు.

ఈ పరంపర మరింత ఉధృతమైంది. అన్నమయ్య రాయచోటి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డెప్పగారి రమేష్ రెడ్డి, జనసేన సీనియర్ నేత పోతిన మహేష్, మాజీ శాసన సభ్యురాలు, జనసేనకు చెందిన సీనియర్ నాయకురాలు పాముల రాజేశ్వరి.. వైఎస్ఆర్సీపీలో చేరారు.ఇక తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, హిందూపురం లోక్‌సభ మాజీ సభ్యుడు నిమ్మల కిష్టప్ప సైతం వైఎస్ఆర్సీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటోన్నట్లు తెలుస్తోంది. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన నిమ్మల కిష్టప్పకు ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు.
హిందూపురం లోక్‌సభ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి కేటాయించారు. అసెంబ్లీ టికెట్ కూడా ఆయనకు దక్కలేదు. పుట్టపర్తి టికెట్ ఆశించినప్పటికీ- దాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కుమార్తె సింధూర రెడ్డికి ఇచ్చారు. దీనితో ఇప్పటికే నిమ్మల కిష్టప్ప టీడీపీకి రాజీనామా చేశారు.ఆయనతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సంప్రదింపులు జరిపారు. నేరుగా ఆయన నివాసానికే వెళ్లి భేటీ అయ్యారు. వైఎస్ఆర్సీపీలో చేరాలంటూ ఆహ్వానించారు. దీనికి నిమ్మల కిష్టప్ప అంగీకరించారని తెలుస్తోంది. త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications