జగన్ ఎలా ఇవ్వగలిగారు? చంద్రబాబు ఎలా ఇవ్వలేకపోతున్నారు?: ఎవరు మంచి అడ్మినిస్ట్రేటర్?
అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అనేది చంద్రబాబుకు పరిపాటేనని జీవీ హర్షకుమార్ అన్నారు. సంపూర్ణ రైతు రుణమాఫీ అనే ఒకే ఒక్క కారణంతో 2014 నాటి ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని గుర్తు చేశారు. ఆ తరువాత దాన్ని ఎలా ఎగ్గొట్టాడో అందరికీ తెలిసిందేనని చెప్పారు.
2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యాడని విమర్శించారు. ప్రత్యేక హోదాను సాధించలేకపోయారని, విశాఖ ఉక్కును కాపాడలేకపోయారని ధ్వజమెత్తారు. అందుకే 2019లో అతి దారుణంగా చంద్రబాబును ఓడించారని పేర్కొన్నారు. 2019లో ఖాళీ బడ్జెట్‌ను, ఖాళీ ఖజానాను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అప్పగించారని గుర్తు చేశారు.

2019లో అధికారంలోకి వచ్చాక జగన్ నిరాటంకంగా సంక్షేమ పథకాలను అమలు చేశారని జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు. ఇప్పుడు చేయలేనంటూ చేతులెత్తేసిన ఈ ఒక్క పథకాన్ని కూడా జగన్ ఆపలేదని, ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేంత వరకూ అమలు చేశాడని చెప్పారు.
తొలిసారిగా ముఖ్యమంత్రి అయినా గానీ, ఖజానా ఖాళీగా ఉన్నా గానీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా జగన్ అమలు చేసి చూపించారని హర్షకుమార్ అన్నారు. 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం ఇప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేయలేనంటోన్నారని వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటరా? లేక జగన్ మంచి అడ్మినిస్ట్రేటరా? అని హర్షకుమార్ ప్రశ్నించారు. వలంటీర్ల వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా పేదలకు సంక్షేమ పథకాలను అందజేయడంలో ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కంటే జగన్ నిస్సందేహంగా అగ్రస్థానంలో ఉంటాడని అన్నారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైందని, ఇప్పటివరకు ఒక్క పథకం కూడా అమలు చేయలేదని జీవీ హర్షకుమార్ విమర్శించారు. స్కాలర్‌షిప్, నిరుద్యోగ భృతి, అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లకు ఒక్క లబ్ది కూడా ప్రభుత్వం నుంచి చేకూర లేదని చెప్పారు.

చంద్రబాబు ఎన్నికల్లో ఊదరగొట్టిన సూపర్ 6 హామీల్లో పింఛన్లు మినహా ఏ ఒక్కటైనా అమలయిందా అని ప్రశ్నించారు. ఉచిత బస్సు, తల్లికి వందనం, మహిళలకు ఇస్తానని చెప్పిన 1,500 రూపాయల మొత్తం.. ఇలా ఏ ఒక్కటీ కార్యాచరణలోకి రాలేదని అన్నారు. అసమర్థ, చేతకాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోబోతున్నారని అన్నారు.
ఇంత అసమర్థ ముఖ్యమంత్రిని ఇప్పటివరకు తాను చూడలేదని హర్షకుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా తెలిసినప్పటికీ- అధికారంలోకి రావాలనే కాంక్షతో విపరీతమైన హామీలను ఇచ్చారని చెప్పారు. హామీలు ఇచ్చి, ఎన్నికల్లో నెగ్గిన తరువాత ఎగ్గొట్టడం మోసపూరితమని విమర్శించారు.
420 ఛీటింగ్ ఆఫ్ ది పబ్లిక్ కింద కేసు కూడా పెట్టొచ్చని, దాని ప్రకారమే తాము వెళ్లాలని అనుకుంటున్నట్లు జీవీ హర్షకుమార్ అన్నారు. సంక్షేమ పథకాలను జగన్ ఎలా ఇవ్వగలిగాడు? మీరు ఎలా ఇవ్వలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచించాలని హితవు పలికారాయన. నయా పైసా కూడా చంద్రబాబు ఎవరికీ ఇవ్వలేదని, అన్నీ మోసపూరిత మాటలేనని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications