వైసీపీ సర్కార్ పై నిమ్మగడ్డ వార్ సశేషం..? ఎన్నికల వేళ కీలక అడుగులు..!
ఏపీలో మూడేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వంపై ముఖాముఖీ పోరాటం చేసిన మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు ఎన్నికలకు ముందు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు మరో పోరాటం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే స్వచ్చంధ సంస్ధ కార్యదర్శిగా మారి వైసీపీ ప్రభుత్వ బాధితుల్ని పోగేసి వారికి సాయం చేసేందుకు స్కెచ్ సిద్ధం చేసుకుంటున్నారు. వారిని జనంలోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మార్చే పనిలో ఉన్నారు.

రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో బాధితులుగా మారిన వాళ్లకు సాయం చేసేందుకు సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ సంస్ధ ద్వారా నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యంగా పోలీసు కేసులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవాలని ఆయన నిర్ణయించారు. త్వరలో వీరికి న్యాయ సలహాలు అందిస్తామని నిమ్మగడ్డ ఇవాళ ప్రకటించారు. అలాగే తమ సంస్ధ తరఫున ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ పాలనపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఏపీలో దారుణ పాలన చూడటం బాధాకరంగా ఉందని మాజీ సీఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేస్తే కొందరిలో అసహనం కనిపిస్తోందన్నారు. నిరసన తెలియజేయకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో చిన్న చిన్న అంశాలకే ఐపీసీ సెక్షన్లతో కేసులు నమోదవుతున్నాయని నిమ్మగడ్డ ఆరోపించారు. రాజకీయ పరంగా దిగువస్థాయి వారిపై కేసులు పెడితే స్వేచ్ఛగా ఎన్నికలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరవధికంగా సెక్షన్ 30, 144 సెక్షన్‌లు ఎలా కొనసాగుతున్నాయని నిమ్మగడ్డ అడిగారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పోలీసు కేసులపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ స్వతంత్రంగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిందని, దీని ద్వారా త్వరలోనే బాధితులకు న్యాయ సలహాలు ఇస్తామన్నారు.












Click it and Unblock the Notifications