అమరావతి పై వెంకయ్య కీలక ప్రతిపాదన, అమిత్ షా అంగీకారం..!!
ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్ లో చట్టం ద్వారా రాజముద్ర వేసేందుకు రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే ఏపీ కేబినెట్.. ఏపీ అసెంబ్లీ ఈ మేరకు కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసి పంపారు. ఈ నెల 1వ తేదీన కేంద్ర కేబినెట్ ఆమోదం.. ఆ వెంటనే పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి ఆమోదించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇదే అంశం పైన ఇప్పుడు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కీలక చర్చలు చేసారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చర్చించారు. ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లును ఈ సమావేశాల్లోనే పెట్టి ఆమోదించాలని వెంకయ్య కోరారు. అమరావతికి 2015లో మోదీ శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అమిత్‌షాకు గుర్తుచేసారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సాయం కూడా చేసిందని, భవిష్యత్తులో అమరావతికి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూడాలని హోంమంత్రి అమిత్ షా కి వెంకయ్య విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారని వెంకయ్య నాయుడు తెలిపారు. తన మంత్రిత్వ శాఖ నుంచి అన్నీ క్లియర్ అయ్యాయని, కేబినెట్‌లో పెట్టి ఆమోదించడం ఒక్కటే మిగిలిందని అమిత్ షా చెప్పినట్టు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

ఈ సమావేశాల్లోనే అమరావతికి రాజముద్ర
ఇదే సమయంలో ఏపీ రాజధానిగా అమరావతి ఖరారు సమయంలో.. తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, రాజధాని నిర్మాణానికి కేంద్రం అందించిన ప్రారంభ సాయం గురించి వివరించారు. అయితే 2019 తర్వాత మారిన రాజకీయ పరిణామాలు, రాజధాని మార్పు ప్రయత్నాల వల్ల తలెత్తిన న్యాయపరమైన మరియు పరిపాలనాపరమైన ఇబ్బందులను ఆయన హోంమంత్రికి వివరించారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చట్టబద్ధమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దీంతో.. ఏపీ అసెంబ్లీలో చేసిన తీర్మానం అందిన వెంటనే మిగిలిన ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో, ఈ వారంలోనే పార్లమెంట్ లో అమరావతి పైన చారిత్రక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications