పవన్ పై రోజా షాకింగ్ కామెంట్స్-ఆయనతో పెట్టుకుంటే.. ఈ మధ్యే రుచిచూశారు..!
తిరుపతిలో టీటీడీ గోశాలలో గోవులు చనిపోతున్నా సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా మౌనంగా ఉంటారని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఇవాళ ప్రశ్నించారు. పదవులిచ్చేసి, ప్యాకేజీలిచ్చేస్తే నీ నోరు పెగలదా అని పవన్ కళ్యాణ్ ను ఆర్కే రోజా ప్రశ్నించారు. చంద్రబాబును కాపడటానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్, సనాతన ధర్మాన్ని కాపడతానని చెప్పుకున్న వ్యక్తి తిరుమలలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని అడిగారు. నీకు, నీ అన్నకూ పదవులు, ప్యాకేజీలు ఇచ్సేస్తే నోరు పెగలదా అని అడిగారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం కాపాడానని చెప్పారని, గోవులు చనిపోతున్నాయని, కాపాడమని అడిగితే మాజీ టీటీడీ ఛైర్మన్ పై కేసులు పెట్టడం ఏంటని రోజా ప్రశ్నించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చంద్రబాబుకు ఆల్రెడీ తెలుసని, పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య కొంచెం రుచి చూశాడన్నారు. కాబట్టి ఎప్పుడూ దేవుడితో పెట్టుకోవదని హితవు పలికారు. దేవుడి విషయంలో అపచారం చేయొద్దన్నారు.

తిరుమల విషయంలో ఎవరు తప్పులు చేసిన, ఎంత పెద్దవారైనా కేసులు పెట్టి జైలుకు పంపాలని రోజా కోరారు. అంతే కానీ జరుగుతున్న తప్పుల్ని నిరూపించిన వారిపై తప్పుడు కేసులు పెడతామని భయపెట్టి హౌస్ అరెస్టులు చేయడం సరికాదన్నారు. మీరు చెప్పినట్లు కరుణాకర్ రెడ్డి ఒక్కరే అయినా వస్తారని, లేకపోతే వైసీపీ నేతలంతా వస్తారని రోజా తెలిపారు. అక్కడ గోవులు, ఆవుదూడలు చనిపోతున్నాయనే మాట నిజమన్నారు. వాటిని సంరక్షించి గోవుల మృతికి కారకులైన వారిని శిక్షించాలన్నారు.
కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్లో పవన్ కూ భాగముందని, దానికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగాలని పవన్ కు రోజా సూచించారు. కొండమీద హత్య జరిగిందని, హెలికాప్టర్లు తిరుగుతున్నాయని, చెప్పులేసుకుని తిరుగుతున్నారని, బిర్యానీ, గంజాయి అమ్ముతున్నారని, గోవులు చనిపోతున్నాయని, వీటికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ తిరుమల మెట్లు కడగాలన్నారు. ఎక్కడో ఏదో జరిగితే ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. తిరుమలలో తప్పులు జరుగుతుంటే ఎలా మౌనంగా ఉంటారని రోజా విమర్శించారు.












Click it and Unblock the Notifications