ఊహకందని మాస్టర్ స్కెచ్-చంద్రబాబు అనుభవమంతా! వైసీపీ మాజీ ఎమ్మెల్యే షాకింగ్..!
ఏపీలో అధికార కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నేతలు ఊహలకు అందని మాస్టర్ స్కెచ్ తో ఇసుకను దోపిడీ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరించి దోపిడీకి ప్లాన్ వేశారని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో ఇసుక పంపిణీలో లోపాలు జరిగినట్టు ఎల్లోమీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు గుర్తించాలన్నారు.
2014-19 మధ్యలో కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఇసుక విధానం కోసం 19 జీవోలు ఇచ్చిందని, ఎమ్మెల్యేలు, నాయకులకు ఎలా దోచిపెట్టవచ్చో చూపిస్తున్నారని టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. రాజకీయాల్లో ఎన్నికల హామీలకు విలువ లేదని చంద్రబాబు మళ్ళీ నిరూపించారన్నారు. తాను మారినట్టు, ప్రజల కోసమే పని చేస్తున్నట్టు చంద్రబాబు నటిస్తారని, అధికారంలోకి రాగానే తన నిజ స్వభావాన్ని చూపిస్తారని విమర్శించారు.

ఈరోజు 18 టన్నుల లారీ విలువ రూ.33 వేలకు పైగా ఉందని, పేద, మధ్య తరగతి ప్రజలు బతికేదెలా అని సుధాకర్ బాబు ప్రశ్నించారు. తమ హయాంలో ఇసుకపై 3,750 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని తెలిపారు. అందరూ దసరా పండుగ హడావుడిలో ఉంటే టీడీపీ నేతలు మాత్రం మద్యం టెండర్ల పండుగలో ఉన్నారన్నారు. రెండు రోజుల్లోనే టెండర్లు పిలవటం ఏంటని ప్రశ్నించారు. ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎల్లోమీడియాలో వార్తలు ఎందుకు రావటం లేదని నిలదీశారు. మద్యం టెండర్లలో టీడీపీ నేతలందరూ పాల్గొనలేకపోయారని, వారి కోసమే రెండు రోజులు గడువు పెంచారని తెలిపారు.
మద్యాన్ని దూరం చేయాలని జగన్ కోరుకుంటే, చంద్రబాబు మాత్రం ఏరులై పారించాలని చూస్తున్నారని సుధాకర్ బాబు విమర్శించారు. మరోవైపు గట్టుచప్పుడు కాకుండా ఇసుకకు టెండర్ పెట్టేశారన్నారు. ప్రభుత్వ ఆదాయానికి పూర్తిగా గండికొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో ఉపయోగపడుతుందని 80 లక్షల టన్నుల ఇసుకను రెడీ చేసి పెడితే టీడీపీ నేతలు 40 లక్షల టన్నుల ఇసుకను అక్రమంగా అమ్మేసుకున్నారన్నారు. ఇప్పుడు భారీస్థాయిలో రేట్లు పెంచటానికి కారణం ఏంటో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. సామాన్యలకు టెండర్లు వేసే అవకాశం లేకుండా చేశారన్నారు.












Click it and Unblock the Notifications