ఏపీలో రాజ్యసభ ఎన్నికలు వాయిదా ! ఈసీని కోరిన వైసీపీ మాజీ ఓనర్.. !
ఏపీలో ఈ ఏడాది మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉంది. రాజ్యసభలో ఖాళీ అవుతున్న మూడు స్ధానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పదవీకాలం ముగియడంతో ఈ మూడు సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల్ని వాయిదా వేయాలని కోరుతూ వైసీపీ మాజీ వ్యవస్ధాపక అధ్యక్షుడు శివకుమార్ ఇప్పుడు ఈసీని ఆశ్రయించడం సంచలనం రేపుతోంది.
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మూడేళ్ల క్రితం చేసిన రాజీనామాను హఠాత్తుగా ఆమోదిస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీలు ఫిరాయించిన 9 మంది వైసీపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలకు కూడా అనర్హత వేటు ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని కోరారు. అయితే వీరి సంగతి ఏమో కానీ గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదించిన స్పీకర్ వ్యవహారం ఇప్పుడు ఈసీకి చేరింది.

రాజ్యసభ ఎన్నికల్లో అధికార వైసీపీకి లబ్ది చేకూర్చేందుకు స్పీకర్ తమ్మినేని ఇలా గంటా శ్రీనివాస్ వివరణ తీసుకోకుండానే రాజీనామాను ఆమోదించారని వైసీపీ వ్యవస్ధాపక అధ్యక్షుడు, ప్రస్తుత యుగ తులసి పార్టీ అధ్యక్షుడు అయిన శివకుమార్ ఈసీకి పంపిన ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. ఇదే వైసీపీకి లబ్ది చేకూర్చేందుకేనని మెజార్టీ జనం భావిస్తున్నారని, కాబట్టి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఈసీని శివకుమార్ కోరారు.
రాజ్యసభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిశాకే రాజ్యసభ ఎన్నికలు నిర్వహించాలని శివకుమార్ ఈసీకి రాసిన లేఖలో కోరారు.












Click it and Unblock the Notifications