రాజమండ్రిలో కేరళ యువతిపై రేప్: నలుగురు రౌడీషీటర్లు అరెస్ట్
అమరావతి: కేరళకు చెందిన ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. రౌడీ షీటర్లు కక్కల సతీష్, తాడేపల్లి ప్రేమ్‌కుమార్, పలివెల రాజు, కంచి సత్యమణికంఠలు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నలుగురు రౌడీషీటర్లను అడిషనల్ ఎస్పీ రెడ్డి గంగాధర్ ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ యువతి అత్యాచారం కేసులో వారిపై 341, 365, 376డి, 323,506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
వివరాల్లోకి వెళితే.... స్నేహితురాలి పెళ్లి కోసం రాజమండ్రి వచ్చిన కేరళ యువతిని నలుగురు రౌడీషీటర్లు అపహరించారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత యువతిని ఆటోలో రాజమండ్రికి తీసుకుని వస్తున్న క్రమంలో సదరు వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ముగ్గురు రౌడీ షీటర్లతోపాటు యువతి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దాంతో యువతి పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో వెంటనే పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
అదేవిధంగా నలుగురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే బాధితురాలు కేరళ రాష్ట్రానికి చెందిన యువతి అని పోలీసులు తెలిపారు. స్థానిక టిటిడి కల్యాణ మండపంలో స్నేహితురాలి పెళ్లి నేపథ్యంలో శనివారం రాత్రి రాజమహేంద్రవరం వచ్చింది.
అక్కడే మద్యం సేవిస్తున్న ముగ్గురు రౌడీ షీటర్లు ఆమెను అపహరించారని పోలీసులు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప సీరియస్‌గా ఉండటంతో నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆయన ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు.












Click it and Unblock the Notifications