ఏపీలో ఉచిత బస్సుతో ఒక్కొక్కరికీ మిగిలేది ఎంతంటే ? ఆంక్షలతో లెక్కిస్తే..!
ఏపీలో కూటమి సర్కార్ మహిళలకు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. స్త్రీ శక్తి పేరుతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్టవ్యాప్తంగా మహిళలు ఉచితంగా ఐదు రకాల బస్సుల్లో ప్రయాణించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఏసీ, స్లీపర్, ఘాట్ రోడ్డు, నాన్ స్టాప్ వంటి మరో ఆరేడు రకాల బస్సుల్లో ప్రయాణాలకు అనుమతించలేదు. ఈ లెక్కన ప్రతీ మహిళకు నెలకు ఎంత మిగులుతుందనే దానిపై చర్చ జరుగుతోంది.
నిన్న గుంటూరు జిల్లా ఉండవల్లిలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అదే బస్సులో విజయవాడకు ప్రయాణించారు. ఈ మార్గమధ్యలో వారు ఈ బస్సుల్లో ఎక్కిన మహిళా ప్రయాణికులతో సంభాషించినప్పుడు వారికి నెలకు ఎంత మిగులుతుందనే చర్చ వచ్చింది. వీరు ఎక్కిన బస్సు మెట్రో ఎక్స్ ప్రెస్. సిటీ పరిధిలో ప్రయాణాలకు ఇందులో మహిళలకు ఉచితంగా అనుమతిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే మహిళలు ప్రభుత్వ పెద్దలకు చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వల్ల ఇప్పటికే తమకు అవుతున్న ఖర్చు మిగులుతుందని మహిళలు ప్రభుత్వ పెద్దలకు తెలిపారు. అదెంతో కూడా చెప్పేశారు. ఈ లెక్కన చూస్తే బాలికలు లేదా మహిళలు తమకు నెలకు రూ.1500 నుంచి 2 వేల వరకూ ఆదా అవుతుందని చెప్పారు. అంటే నగర పరిధిలో చేసే ప్రయాణాలకు ఈ మొత్తం వారికి ఆదా కానుంది. అదే దూర ప్రాంతాల ప్రయాణాలు రెగ్యులర్ గా చేసే వాళ్లు అయితే దీనికి రెట్టింపు మొత్తం మిగిలే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేసే మహిళా ఉద్యోగులకు నాలుగైదు వేల వరకూ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే సుదూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు ట్రిప్ లు వేస్తే ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు మహిళలు ఉంటే రానుపోను చూసుకున్నా ఇంకా ఎక్కువే ఆదా అవుతుంది. అలాగే ఉచిత బస్సు అందుబాటులో ఉంది కాబట్టి అవసరం లేకపోయినా ప్రయాణాలు చేసే వారు కూడా ఉంటారు. దీంతో ఎలా చూసినా ఉచిత బస్సు పథకంతో మహిళలకు భారీ లబ్ది కలగడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications