సీ ప్లేన్ లో విజయవాడ నుండి శ్రీశైలం.. సీఎం చంద్రబాబు పర్యటన!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన వరాలు ఏపీ ప్రగతికి దోహదం చేస్తున్నాయి. ఇక కేంద్ర విమానయాన శాఖామంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు ఉండటం కూడా ఏపీకి అదృష్టంగా మారింది. ఏపీలో ఇక నుండి సీ ప్లేన్ లు కృష్ణానదిలో దూసుకుపోనున్నాయి. ఏపీ పర్యాటక అభివృద్ధికి ఇవి బాటలు వేస్తున్నాయి. ఇక ఈ క్రమంలో నేడు ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ నుండి శ్రీశైలం సీ ప్లేన్ లో ప్రయాణం చేసి శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు.
సీ ప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించనున్న చంద్రబాబు
ఏపి సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో బాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం జలాశయం వరకు సీ ప్లేన్ విమానం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. నేడు ఉదయం 10.30కి విజయవాడ పున్నమి ఘాట్ కు చేరుకోనున్న చంద్రబాబు సీ ప్లేన్ లో విజయవాడ నుండి 12గంటలకు బయలుదేరి 12.40కి శ్రీశైలం చేరుకుంటారు. అక్కడ శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని మళ్ళీ తిరిగి సీ ప్లేన్ లోనే విజయవాడకు చేరుకోనున్నారు.

సీఎం చంద్రబాబు పర్యటన.. భారీ భద్రత
ఇక ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పాతాళ గంగ వద్ద సీ ప్లేన్ ల్యాండ్ అయ్యే పరిసర ప్రాంతాలలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక శ్రీశైలం అటవీ ప్రాంతంలో కూడా గ్రేహౌండ్స్ బలగాల మోహరించి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోలీస్ బలగాలు రెస్క్యూ టీం లను కూడా రెడీగా ఉంచారు.
14 సీట్ల సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించనున్న చంద్రబాబు
నేడు ఏపీ సీఎం చంద్రబాబు డి హవిల్ల్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించనున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా శ్రీశైలంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక నేడు శ్రీశైలం పర్యటనలో భాగంగా చంద్రబాబు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడంతో పాటు అక్కడ పలు కార్యక్రమాలలో పాల్గొని తిరిగి సీ ప్లేన్ ద్వారానే విజయవాడకు వెళ్ళనున్నారు.
ఏపీలో పర్యాటకాభివృద్ధికి సీ ప్లేన్ సర్వీసులు
శ్రీశైలం జలాశయంలో ఈ సీ ప్లేన్ లతో శ్రీశైలం మల్లన్న భక్తులకు ఆహ్లాదం, ఆనందం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి ఈ సీ ప్లేన్ విమానం సర్వీసులు బాగా ఉపయోగపడతాయి. వీటితో శ్రీశైలం క్షేత్రానికి పర్యాటకుల సంఖ్య బారీగా పేరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. శ్రీశైలం క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేసేందుకు ఏపి సిఎం చంద్రబాబు శ్రీశైలం క్షేత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సీ ప్లేన్స్ తో శ్రీశైలంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది.












Click it and Unblock the Notifications