హోదా రగడ: 'బీజేపీ మాటల్లో నిజం లేదు', 'హోదా బిల్లుకు మద్దతు తెలిపండి'
అమరావతి: ఏపీకి ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించడం హాస్యాస్పదమని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సమయంలో కేంద్రమంత్రులు ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడం బాధ కలిగించిందన్నారు.
చంద్రబాబు ఢిల్లి వెళ్ళిన ప్రతిసారి ప్రత్యేక హోదా, నిధులు గురించి డిమాండ్ చేస్తూనే ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం భారీ ఎత్తున నిధులిస్తుందంటూ బీజేపీ నేతలు చెప్తోన్న మాటల్లో నిజం లేదన్నారు. బీజేపీ నేతల లెక్కలు అడ్డదిడ్డంగా ఉన్నాయని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతో సతమతమవుతుంటే కేంద్రం అండగా నిలవాల్సింది పోయి, అనవసర ఆరోపణలు చేస్తోందన్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లక్ష కోట్లు ఎప్పుడు ఇచ్చిందో చెప్పాలని ఆయన నిలదీశారు.

హోదాపై కేవీపీ ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇవ్వండి: రఘువీరా
ఈనెల 13వ తేదీన రాజ్యసభలో చర్చకు రానున్న కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలను కోరుతున్నామని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆదేశాల మేరకు ఎంపీలకు ఇప్పటికే విప్ జారీ చేసినట్లు చెప్పారు. రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్‌తో బీజేపీ, టీడీపీ నిజాయితీ బయటపడుతుందని అన్నారు.
పప్పులను అక్రమంగా నిల్వ చేస్తే చర్యలు తప్పువు: మంత్రి సునీత
నిత్యావసర సరుకుల ధరల తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. బుధవారం ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఐదు మెట్రిక్ టన్నుల కందిపప్పు, రెండు వేల టన్నుల మినపప్పును, మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు ఆమె చెప్పారు.
పప్పులను అక్రమంగా నిల్వ చేస్తే చర్యలు తీసుకుటామని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా పప్పుల విషయంలో అవసరమైతే కేసులు పెట్టేందుకు కుడా వెనకాడబోమని హెచ్చరించారు. పప్పుధాన్యాలను ఇతర రాష్ట్రాలకు తరలించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. రైతుబజార్లలో రూ.30కే నాణ్యమైన బియ్యం అందిస్తామన్నారు.












Click it and Unblock the Notifications