కలకలం: టిడిపి పోస్టర్‌లో మంత్రి గల్లా అరుణకుమారి
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం కోటాలలో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ సొంతూరు అయిన కోటాలలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పోస్టర్లలో రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి ఫొటోను కూడా పెట్టారు.
ఇప్పటికే మంత్రి గల్లా అరుణాకుమారి కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దిగుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు వెలియడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గతంలో కూడా గల్లా అరుణకుమారి టిడిపిలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే తాను టిడిపిలో చేరబోనని అప్పుడు గల్లా అరుణకుమారి వివరణ ఇచ్చుకున్నారు. అయినా కూడా గల్లా అరుణకుమారి పర్యటించిన ప్రాంతాలలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోపాటు టిడిపి కార్యకర్తలు కూడా ఘనస్వాగతం పలకడం గమనార్హం.
అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు కోటాల గ్రామం వస్తున్నారని తెలియడంతో టిడిపి కార్యకర్తలు ఎంపి శివప్రసాద్ ఫొటోతోపాటు మంత్రి గల్లా అరుణకుమారి ఫొటోను కూడా పెట్టి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పసుపు రంగులో ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీలో అరుణ కుమారి ఫొటోను పెట్టడం వివాదానికి తావిచ్చినట్లయింది. కాగా టిడిపి కార్యకర్తలు వారి ఫ్లెక్సీలో తన ఫొటోను పెట్టడం తనకు బాధ కలిగించిందని మంత్రి గల్లా అరుణకుమారి అన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications