24 లక్షల సర్వింగ్స్.. 15 రకాల మెనూ: అక్కడే టీటీడీ సక్సెస్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అయిదో రోజైన శనివారం నాటి రాత్రి గరుడసేవ.. అత్యంత వైభవంగా ముగిసింది. గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు అశేష భక్తజనావళిని కటాక్షించారు. గజరాజులు ముందు నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల వేదఘోష, మంగళవాయిద్యాల మధ్య స్వామివారి ఊరేగింపు అచంచల భక్తిభావంతో సాగింది.
వేలాదిమంది భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు పట్టారు. గోవిందా.. గోవిందా.. అంటూ స్వామివారిని స్మరించుకున్నారు. గోవిందుడి నామస్మరణతో సప్తగిరులు మార్మోగాయి. బ్రహ్మోత్సవాల్లో అన్నింటికంటే కూడా గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం.. గరుడుడు జ్ఞాన, వైరాగ్యాలకు ప్రతీక. గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకోవడం సర్వపాప ప్రాయశ్చిత్తానికి, జ్ఞానవైరాగ్య ప్రాప్తికి దోహదం చేస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే దీనికి 108 వైష్ణవ దివ్యదేశాల్లో దీనికి మొదటి ప్రాధానత లభిస్తుంటుంది.

శనివారం సాయంత్రం 6:30 గంటలకు మండపం నుంచి స్వర్ణ గరుడ వాహనంపై స్వామివారు వెలుపలకు రాగానే నాలుగు మాడ వీధులు భక్తిపారవశ్యంతో పులకించాయి. లక్షలాది భక్తులు స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించుకుంటూ గోవిందుడి నామస్మరణ చేశారు. ఈ సందర్భంగా గ్యాలరీలన్నీ కూడా భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. నాలుగు మాడ వీధుల్లో ఏర్పాటు చేసిన 190 గ్యాలరీల్లో సుమారు 1.80 లక్షల మంది భక్తులు వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.
శుక్రవారం రాత్రి నుంచే అనేక గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. శనివారం తెల్లవారుజాము నుంచి గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు పాలు, అన్నప్రసాదం, పానీయాలు, అల్పాహారాన్ని అందించారు శ్రీవారి సేవకులు. భక్తులకు అన్నప్రసాదం, తాగునీటి పంపిణీతోపాటు రద్దీ నియంత్రణ, చిన్నారులకు ట్యాగింగ్ తదితర సేవల కోసం సుమారు 2,000 మంది శ్రీవారి సేవకులు, 600 మందికి పైగా టీటీడీ సిబ్బంది ప్రత్యేకంగా నియమితులయ్యారు.
తిరుమలలోని ఎనిమిది కీలక ప్రాంతాల్లో సెక్టోరల్ అధికారులను ఏర్పాటు చేసి 24 గంటలపాటు ఏర్పాట్లను పర్యవేక్షించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి గ్యాలరీలను ఎప్పటికప్పుడు పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. భక్తుల నుంచి నేరుగా అభిప్రాయాలను కూడా సేకరించారు.
సామాన్య భక్తులు గరుడ వాహన సేవను సులభంగా దర్శించుకునేందుకు తిరుమలనంబి నుంచి ప్రత్యేక క్యూలైన్ ద్వారా వాహన దర్శనానికి అనుమతించారు. గరుడసేవ సందర్భంగా భక్తులకు మొత్తం 15 రకాల మెనూ అందించారు. ఇందులో ఎనిమిది రకాల ఆహార పదార్థాలు, ఏడు రకాల పానీయాలు ఉన్నాయి. భక్తుల భారీ రాకను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్నప్రసాదం విభాగం ముందస్తు ప్రణాళికతో అన్నప్రసాదం, పానీయాలు, అల్పాహారం కలిపి సుమారు 24 లక్షల సర్వింగ్స్ అందించేలా ఏర్పాట్లు చేసింది.














Click it and Unblock the Notifications
