జగన్ కేసులో సమన్లు: గీతారెడ్డి రాజీనామా తప్పదా?

గతంలో మంత్రి పదవికి ధర్మాన ప్రసాద రావు రాజీనామా చేసినప్పుడు ఆయన కేసును సిబిఐ కోర్టు విచారణకు పరిగణనలోకి తీసుకున్నాకే ముఖ్యమంత్రి దానిని ఆమోదించారు. ఇప్పుడు గీతారెడ్డి విషయంలోనూ అదే విధానాన్ని అమలు చేసే అవకాశం లేకపోలేదంటున్నారు.
లేపాక్షి నాలెడ్జ్ హబ్‌పై సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోవడం, కోర్టు గీతారెడ్డికి సమన్లు జారీ చేయడంతో ఆమె రాజీనామా వ్యవహారం చర్చకు వస్తోంది. సిబిఐ చార్జ్‌షీట్ దాఖలు చేసిన రోజే గీతారెడ్డి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కిరణ్‌ను కలిసి తాను రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే అప్పుడే తొందర పడవద్దంటూ కిరణ్ ఆమెకు హితవు పలికారు. కేసును కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకునేంత వరకూ ఓపిక పట్టాలని సూచించారు.
కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారానికి సంబంధించి నిందితులకు సిబిఐ కోర్టు గురువారం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. వైయస్ జగన్, మంత్రి గీతారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావుతో పాటు 14 మంది నిందితులకు సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 15వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో వైయస్ జగన్ ఆస్తుల కేసులో గీతారెడ్డి తొలిసారి కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు.












Click it and Unblock the Notifications