ఏపీలో 'కేజీఎఫ్' గనులు
కర్నూలులో బంగారు బాతుగుడ్లు బయటపడుతున్నాయి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో కూడా బంగారం గనులున్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ప్రాథమికంగా నిర్ధారించింది. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర జియోలాజికల్ బోర్డు సమావేశంలో .. కర్నూలు జిల్లా డీడీ రాజశేఖర్, నంద్యాల జిల్లా ఏడీ రామచంద్రకు సర్వేకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
అక్కడ లభ్యమయ్యే బంగారానికి సంబంధించిన వివిధ అంశాలను నిర్ధారించడానికి వీలుగా సమగ్ర సర్వే చేయాలని జీఎస్‌ఐ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం తుగ్గలి మండలంలో బంగారం గనులున్నట్లుగా గుర్తించి అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. తాజాగా ఆస్పరి మండలంలో కూడా ఉన్నట్లు తేలింది. అయితే ఇక్కడ తవ్వకాలు చేయడం లాభదాయకమా? కాదా? అనే విషయం తేలాల్సి ఉంది. అందుకనుగుణంగా సర్వే చేయాలని జీఎస్ ఐ భావిస్తోంది. అలాగే తాడిపత్రికి 12 కిలోమీటర్ల దూరంలో గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని, వాటి పరిణామాన్ని అంచనా వేసేందుకు ఓఎన్జీసీ సర్వే చేపట్టనుంది.

ఏపీలోని జొన్నగిరి ప్రాజెక్ట్‌లో వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నారు. సంవత్సరానికి 750 కిలోగ్రాముల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ గనిలో వచ్చే ఏడాది చివరికి పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమవనుంది. 2013లోనే ఈ గనికి అనుమతులు వచ్చాయి. బంగారాన్ని బయటకు తీయడానికి అవసరమైన ముందస్తు పనులను పూర్తిచేయడానికి 10 సంవత్సరాల సమయం పట్టడం విశేషం.












Click it and Unblock the Notifications