జగన్ పార్టీలో ముసలం: టిడిపివైపు వస్తున్నారని గంటా
విశాఖపట్నం: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విశాఖపట్నం జిల్లాలో తీవ్ర సమస్యను ఎదుర్కొంటోంది. పార్టీ నుంచి తప్పుకోవడానికి చాలా మంది నాయకులు ఎదురు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే శుక్రవారంనాడు ముగ్గురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుడు, మంత్రి గంటా శ్రీనివాస రావును కలుసుకోగా, తాజాగా పూడి మంగపతి రావు ఆయనతో భేటీ అయ్యారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు, నాయకులు అభద్రతా భావంతో ఉన్నారని, వారు టిడిపి వైపు చూస్తున్నారని గంటా శ్రీనివాస రావు శనివారంనాడు అన్నారు. వారు తెలుగుదేశం పార్టీలో చేరాలని చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలను వేరుగా నిర్వహించుకోవాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు. వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు నష్టపోతారని, ఉమ్మడిగా నిర్వహిస్తేనే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్తామని, తెలంగాణ ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఆ సమస్య పరిష్కారం కాకపోతే గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉద్యమ నాయకుడిగానే వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎంసెట్ విషయంలోనూ మొండిగా వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు. రాజకీయ క్రీడతో విద్యార్థులు నష్టపోకూడదని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవానలి ఆయన అన్నారు. మార్చి 9వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సిద్ధమేనని ఆయన చెప్పారు.
ఇంటర్మీడియట్ పరీక్షలను తామే నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 9వ తేదీ నుంచి పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటిస్తూ పరీక్షల తేదీలను కూడా విడుదల చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications