గదిలో బంధించి బాలికపై గ్యాంగ్ రేప్: పరువు కోసం దాచిపెట్టారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్టోబర్ 1వ తేదీన జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది.
పరువు పోతుందనే భయంతో బాలిక తల్లిదండ్రులు ఆ సంఘటనను ఇన్నాళ్లు దాచిపెట్టారు. చివరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు నిందితుల్లో నలుగురు మైనర్ బాలురని తెలుస్తోంది.
విశాఖట్నంలోని గాజువాక నక్కవానిపాలెం బీచ్ కాలనీలో ఈ ఘోరం జరిగింది. చెల్లెతో కలిసి బయటకు వెళ్లిన బాలికను దుండగులు ఓ దుకాణం వద్ద నుంచి ఎత్తుకెళ్లి కాలనీలోని ఓ గదిలో బంధించి అక్టోబర్ 1వ తేదీన సామూహిక అత్యాచారం చేశారు.

అక్టోబర్ 2వ తేదీన బయటకు వచ్చిన బాలిక భయంతో 12వ తేదీ వరకు ఇంటికి వెళ్లలేదు. స్థానికులు గుర్తించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రులు కూడా బాలిక అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాలిక తిరిగి వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
పోలీసులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి, కేసు నమోదు చేసి, ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను విశాఖపట్నంలోని కెజిహెచ్‌కు తరలించారు. విశాఖపట్నంలో తరుచుగా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల దుండగులు ఓ యువజంటను టీజ్ చేశారు. ఓ లా విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారం చేశారు.












Click it and Unblock the Notifications