వీడియో చిత్రీకరణ: మిత్రులతో ప్రేయసిపై గ్యాంగ్ రేప్

ఈ ఘటన జరిగి నెలరోజులైనా ఒక్కరినే పోలీసులు అరెస్టు చేశారు. దాంతో న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి పిర్యాదు చేసింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పిన యువకుడిని నమ్మి యువతి అతనితో వెళ్లింది. మిత్రులతో కలిసి అతను ఆమెపై సామూహిక అత్యాచారం చేశాడు.
హఫీజ్‌బాబా నగర్‌కు చెందిన 15 ఏళ్ల బాలిక, చాంద్రాయణగుట్ట హసీమాబాద్‌కు చెందిన అస్రఫ్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకుంటానని నమ్మించి అస్రఫ్ ఆ బాలికను గత నెల 5వ తేదీన తన ఇంటికి సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఆ సమయానికి స్నేహితులను అక్కడికి రప్పించాడు.
వారంతా కలిసి బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బాలికను బెదిరించారు. దాదాపు రెండు వారాల పాటు తనలోనే తానే కుమిలిపోయిన బాలిక చివరికి విషయాన్ని తల్లితో చెప్పింది. వెంటనే ఆమె తన కూతురిని తీసుకుని కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లింది.
ఘటన జరిగిన ప్రాంతం తన పరిధిలోకి రాదని పోలీసులు ఆమెను వెనక్కి పంపించినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఆమె దక్షిణ మండలం డిప్యూటీ కమిషనర్ త్రిపాఠీని కలిసి విషయం చెప్పింది. త్రిపాఠీ ఆదేశాలతో కంచన్‌బాగ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే, దర్యాప్తును మాత్రం సాగించలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ఓ రౌడీ షీటర్, ఓ మీడియా ప్రతినిధి కలిసి కేసును ఉహసంహరించుకోవాలని తమపై ఒత్తిడి తెస్తున్నట్లు బాధితులు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు చేశారు. తమకు ప్రాణహాని ఉందని కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులపై బాధిత మహిళ హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications