మా తిరుపతి ఇవ్వండి: తమిళ పార్టీ, శ్రీవారికి కిషన్ దీక్ష
చెన్నై/న్యూఢిల్లీ: భాషాప్రయుక్త రాష్ట్రాలుగా తమిళనాడు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ వేరుపడిన సమయంలో తమిళులు అధికంగా నివసిస్తున్న తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు ప్రాంతాలను ఎపిలో కలిపారని, ఇప్పుడు వాటిని తమకు ఇచ్చేయాలని పిఎంకే నేత రాందాస్ డిమాండ్ చేశారు.
తిరుపతిని తమిళనాడుకు ఇచ్చేయాల్సిందేనన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) ద్వారా తెలంగాణకు న్యాయం చేసినట్టే తమిళనాడు ప్రజల ఆకాంక్షను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయంలో తమిళనాడు సరిహద్దులను పునర్వ్యవస్థీకరించారన్నారు.

తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, సత్యవేడు తదితర తమిళులు అధికంగా నివసిస్తున్న తొమ్మిది ప్రాంతాలను ఆంధ్రాలోకి కలిపేశారని, దీనికి తమిళుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా కేంద్రం వినిపించుకోలేదని, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఆ తొమ్మిది ప్రాంతాలను తమిళనాడులో కలిపేందుకు కేంద్రం ముందుకు రావాలన్నారు.
ఢిల్లీలో కిషన్ రెడ్డి దీక్ష
మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్ష ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ఏ గండం లేకుండా విభజన బిల్లు పూర్తిగా గట్టెక్కాలని కోరుతూ ఢిల్లీ ఎపి భవన్‌లో ఆయన వేంకటేశ్వర స్వామి దీక్ష చేపట్టారు. మూడు రోజులుగా ఉపవాసం ఉంటున్నారు. రాజ్యసభలోనూ బిల్లుకు ఆమోదం లభించేవరకు ఆయన దీక్ష కొనసాగుతుందన్నారు. బిల్లుపై తీవ్ర అనిశ్చితి నెలకొనడంతో ఆమోదానికి గల అన్ని విఘ్నాలూ తొలగిపోవాలంటూ 17వ తేదీన కిషన్ రెడ్డి దీక్ష ప్రారంభించారు.
అయితే, ఆ విషయాన్ని పార్టీ వర్గాలు మొదట గోప్యంగా ఉంచి బుధవారం వెల్లడించాయి. బిల్లు పూర్తిస్థాయిలో ఆమోదం పొందాలని తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామికి కిషన్ మొక్కుకున్నారని, ప్రస్తుతం ఉపవాస దీక్ష చేస్తున్నారని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభిస్తే బుధవారమే దీక్షను విరమించుకోవాలని ఆయన అనుకున్నట్లు తెలిపింది. కానీ అలా జరగకపోవడంతో ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications