చాలా అంశాలపై చర్చించాలి: షిండే, యూటికి జైపాల్ నో
న్యూఢిల్లీ: విభజన విషయంలో చాలా అంశాల పైన చర్చించాల్సి ఉందని కేంద్ర హోంమంత్రి, మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు సుశీల్ కుమార్ షిండే మంగళవారం చెప్పారు. ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రేపు మధ్యాహ్నం రెండున్నర గంటలకు జివోఎం భేటీ అవుతుందన్నారు.
విభజన నిర్ణయం నేపథ్యంలో ఎవరికీ ఇబ్బందులు రాకూడదనే తమ ప్రయత్నం అన్నారు. ఎవరికీ బాధ కలగకుండా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం ఉంటుందని చెప్పారు. రేపటి జివోఎం సమావేశం చివరిదని తాము చెప్పలేమన్నారు. కాగా, రేపు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు జివోఎం సమావేశం జరిగే అవకాశముంది. రేపటి భేటీకి ఏడుగురు జివోఎం సభ్యులు హాజరయ్యే అవకాశముంది.
షిండే బిజీ బిజీ
షిండే మంగళవారం వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. కేంద్రమంత్రులు మంత్రి కపిల్ సిబాల్, జైరామ్ రమేష్‌తో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్ర మంత్రులు జైపాల్ రెడ్డి, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిలు కూడా ఆయనతో భేటీ అయ్యారు. జైపాల్ రెడ్డి, జైరాంలు షిండేతో సాయంత్రం మరోసారి భేటీ కానున్నారు.

ఇదే చివరి సమావేశం: జైరాం
రేపు జివోఎం భేటీ అవుతుందని, ఇదే చివరి సమావేశమని జైరాం రమేష్ చెప్పారు.
యూటికి ఒప్పుకోం: జైపాల్
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే అంగీకరించే ప్రసక్తి లేదని జైపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాదు యూటికి, రాయల తెలంగాణకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. ఉమ్మడి రాజధాని చేసేందుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదన్నారు. త్వరలో తెలంగాణ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాయల టికి నో: సురవరం
రాయల తెలంగాణ ఏర్పాటును సిపిఐ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. రాష్ట్రాలను విభజించే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు. రాయల తెలంగాణపై అధికారిక ప్రతిపాదన లేదన్నారు. సీమను ముక్కలు చేయడం సరికాదని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు అడ్డుకునేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నించవచ్చునన్నారు.












Click it and Unblock the Notifications